Tuesday, November 26, 2024

Corrupted Kings – ఎపి రోడ్లు, భవనాల శాఖ‌లో అవినీతి అన‌కొండ‌లు…

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో : రోడ్లు భవనాల శాఖ లో రోజు రోజుకూ వసూళ్ల రాజాల సంఖ్య పెరుగుతుం ది. కొంత మంది అవినీతికి రుచిమరిగి కాంట్రాక్టర్ల బ్యాంకు గ్యారెంటీ, డిపాజిట్టు అమౌంట్లను మింగేస్తు న్నారు. మరికొంత మంది సీనియర్‌ అసిస్టెంట్లు హోదా లో ఉన్న అధికారులు కార్యాలయ నిర్వహణా నిధులను సైతం సొంత ఖాతాకు మళ్లించేసుకుంటున్నారు. ఇలా అవకాశం ఉన్న ప్రతి అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని సొంత ఖజానాను నింపేసుకుంటున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల ప‌రిధిలో జరుగుతున్న అక్రమాలపై ఒక్కొక్కటిగా ఫిర్యాదులు అందుతున్నాయి. వాటిపై జిల్లా కలెక్టర్లు స్పందించి విచారణ జరపడం, ఆవిచారణలో అవినీతి అక్రమాలు వాస్తవమేనని తేలుతుంది. దీంతో శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు దారిమళ్లిన సొమ్మును తక్షణమే రికవరీ చేయాలని కలెక్టర్లు స్పష్టమైన ఆదేశాలు జారీచేస్తున్నా జిల్లాస్థాయిలో ఆశాఖ ఉన్నతాధికారులు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. దీంతో రోడ్లు భవనాల శాఖలో అవినీతిపరులదే ఇష్టారాజ్యంగా మారుతుంది.

రాష్ట్రస్థాయి అధికారులు ఫిర్యాదులపై ప్రశ్నించే సందర్భంలో విచారణ పేరుతో అనకొండలను రక్షించే ప్రయత్నం చేస్తున్నారే తప్ప వారి నుండి రికవరీ మాత్రం చేయలేక పోతున్నారు. రాష్ట్రంలోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లా పరిధిలో గతంలో అనేక ఆరోపణలకు సంబంధించి ఫిర్యాదులు అందడం, వాటిపై ఐఏఎస్‌ స్థాయి అధికారులు విచారణ జరిపి నివేదికలను కూడా సంబంధిత జిల్లా కలెక్టర్లకు అందజేశారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాలకు చెందిన రోడ్లు, భవనాల శాఖ ఎస్‌ఈలకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ సంవత్సరాల తరబడి అవినీతిపరులపై చర్యలు తీసుకోవడంలో వారు జాప్యం చేస్తూనే ఉన్నారు. ఫలితంగా ఆయా జిల్లాల్లో వసూళ్ల రాజాలుగా ఇష్టారాజ్యంగా మారడంతోపాటు ఈతరహా దోపిడీ సంస్కృతి మరికొన్ని జిల్లాలకు కూడా పాకింది. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో కాంట్రాక్టులకు సంబంధించిన బ్యాంకు గ్యారెంటీ సొమ్ములతోపాటు వర్క్‌ ఆర్డర్‌కు సంబంధించి డిపాజిట్లు నిధులను కూడా కొన్ని ప్రాంతాల్లో బొక్కేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నిర్వహణా నిధులను .. మింగేస్తున్నారు
ప్రభుత్వ శాఖలకు సంబంధించి కార్యాలయాల నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతి ఏటా కొంత బడ్జెట్‌ను కేటాయిస్తుంది. ఆనిధులతో ప్రతి నెలా కార్యాలయంలో నిర్వహించే వివిధ కార్యక్రమాలకు ఆనిధులను వెచ్చిస్తుంటారు. అయితే ఉదాహరణకు ప్రకాశం జిల్లా రోడ్లు భవనాల శాఖలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓ అధికారి 2018 నుండి 2022 వరకూ సుమారు రూ. 21 లక్షల మేర నిర్వహణా నిధులను మింగేశారు. ఈ వ్యవహారంపై లోకాయుక్తకు ఫిర్యాదలు అందాయి. దీనిపై స్థానిక జిల్లా కలెక్టర్‌ వెలిగొండ ప్రాజెక్టు స్పెషల్‌ కలెక్టర్‌ను విచారణ అధికారిగా నియమించారు. ఆయన శాఖపరమైన విచారణ చేపట్టి నిర్వహణా నిధులు దుర్వినియోగం అయిన మాట వాస్తవమేనని నిర్ధారణ చేస్తూ ఆదిశగా నివేదికలను జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. దీంతో ఆ సీనియర్‌ అసిస్టెంట్‌ నుండి రూ. 21 లక్షల నిధులను రికవరీ చేయడంతోపాటు అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆర్‌ఒ అండ్‌ బీ ఎస్‌ఈకి ఆదేశాలు జారీచేశారు. అయితే ఈ వ్యవహారం అనంతరం సీనియర్‌ అసిస్టెంట్‌ నెల్లూరు జిల్లాకు బదిలీ కావడంతో స్థానిక అధికారులు ఆయన్ను కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.

ప్రకాశం జిల్లా కలెక్టర్‌ ఆదేశాలను నెల్లూరు అధికారులు అమలు చేయకపోగా విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఇదే తరహాలో ప్రకాశం జిల్లాలోనే మరో అధికారి రూ. 50 లక్షల కాంట్రాక్టు డిపాజిట్‌ నిధులను విడతల వారీగా దారిమళ్లించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాటికి సంబంధించి కొంత మంది అధికారులకు కూడా పెద్ద ఎత్తున వాటాలు అందినట్లు సొంత శాఖలోనే విమర్శలున్నాయి. అదేవిధంగా మరో బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి రూ. 12 కోట్ల బ్యాంకు గ్యారెంటీ సొమ్ములో కూడా గోల్‌మాల్‌ జరిగినట్లు ఆరోపణలు ఉన్నప్పటికీ ఆర్‌ అండ్‌ బీ అధికారులు ఫిర్యాదు అందలేదన్న కుంటిసాకు చూపుతూ శాఖాపరమైన విచారణకు ఆదేశించకపోవడం పలు సందేహాలకు దారితీస్తుంది. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఇదే తరహాలో అడుగుగడున అక్రమాలు చోటు చేసుకుంటున్నా జిల్లా స్థాయి అధికారులు అనకొండలకు వత్తాసు పలుకుతున్నారే తప్ప వారిపై కొరఢా ఝుళిపించడంలో మాత్రం వెనుకడుగు వేస్తున్నారు.

ఫిర్యాదులొస్తున్నా .. పట్టించుకున్న పాపాన పోరు
రోడ్లు భవనాల శాఖలో నిరంతరం ఏదో ఒక నిర్మాణ పనులు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో అయితే ప్రధాన రహదారులతోపాటు వివిధ మార్గాల్లోని రోడ్లు దెబ్బతినడం, ప్రభుత్వ ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక మరమ్మతులు వర్షాలు తగ్గుముఖం పట్టాక శాశ్వత మరమ్మతులు చేపడుతుంటారు. అందుకోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను కూడా కేటాయిస్తుంది. ప్రత్యేకించి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లోటు బడ్జెట్‌లోనూ రాష్ట్రంలోని రోడ్లను ఆధునీకరించేందుకు నిధులను కేటాయిస్తూ వస్తుంది. గడచిన రెండేళ్లలో సుమారు రూ.835 కోట్లను ఆర్‌ అండ్‌ బీకి కేటాయించింది. ఆ నిధులతో సుమారు 4 వేల కీమీకుపైగా రహదారులను మరమ్మతులు, ఆధునీకరణ తదితర పనులు చేపట్టాల్సింది. అయితే వాటిలో చాలా వరకూ పనులు పూర్తయినప్పటికీ అందుకు సంబంధించి కొన్ని నిదులను వసూలు రాజాలు దారిమళ్లించేసినట్లు తెలుస్తుంది. తాజాగా ప్రస్తుత ఏడాది మరో రూ. 746 కోట్లను రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం నిధులను కేటాయించింది. వీటికి సంబంధించి కూడా కొన్ని ప్రాంతాల్లో మరమ్మతులు, మరికొన్ని ప్రాంతాల్లో రోడ్ల ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. ఆయా జిల్లాల పరిధిలో ఎస్‌ఈల సహకారంతో సీనియర్‌ అసిస్టెంట్లు, ఈఈ స్థాయి అధికారులు తమ చేతివాటాలను ప్రదర్శిస్తున్నట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. అయితే వాటిని పట్టించుకునేవారు మాత్రం కరువు అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement