అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఏప్రిల్ 27 నుంచి మే తొమ్మిదో తేదీ వరకు జరిగిన పదో తరగతి పరీక్ష ఫలితాల షార్ట్ మెమోలను జూన్ ఆరో తేదీ నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే. ఆ మెమోల్లో ఏవైనా తప్పులున్నట్లు గుర్తిస్తే సవరణల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆ విషయాన్ని ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయానికి తీసుకు రావాలని డీజీఈ డి. దేవానంద రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. తద్వారా ఒరిజినల్ పాస్ సర్టిఫికెట్లలో ఆ దోషాలు ఉండకుండా చూసుకోవాలని కోరారు. తప్పుల సవరణల కోసం ప్రధానోపాధ్యాయులు నామినల్ రోల్స్‌కు జత చేసిన పాఠశాలల రికార్డులను, హెచ్‌ఎం అటెస్ట్ చేసిన ఒక షార్ట్ మెమో కాపీని ఈ నెల 18వ తేదీలోగా డీజీఈ కార్యాలయానికి అందజేయాలని సూచించారు.
ఇన్‌చార్జ్ ఎస్పీడీగా కమిషనర్
సమగ్ర శిక్ష ఇన్‌చార్జ్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పాఠశాల విద్య కమిషనర్ ఎస్. సురేష్ కుమార్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఎస్‌ఎస్‌ఏ ఎస్పీడీగా కొనసాగుతున్న కె. వెట్రిసెల్వికి కోవిడ్- 19 నిర్ధారణ కావడంతో ఆమెకు ఈ నెల 29 వరకు మెడికల్ లీవ్ మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో అప్పటి వరకు ఇన్‌చార్జ్ ఎస్పీడీగా సురేష్ కుమార్ కొనసాగాలని జీవోలో పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.