Tuesday, November 26, 2024

AP: పెన్షన్ల పేరుతో శవ రాజకీయాలు.. వైసీపీ పై మండిప‌డ్డ చంద్ర‌బాబు

ఎన్నికల కమిషన్ ఆదేశాలు పట్టించుకోవడం లేదు
గూడూరులో పాత్రికేయుల సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు

కర్నూలు బ్యూరో : పెన్షన్ల పంపిణీలో వైసీపీ ప్రభుత్వం శవ రాజకీయాలు చేస్తుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం నేపథ్యంలో కర్నూలు జిల్లా గూడూరులో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెన్షన్ల పంపిణీలో వైసీపీ ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పెన్షన్లను నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ నేడు ప్రభుత్వం ఆధ్వర్యంలో బ్యాంకులో వేస్తామని అధికారులు ప్రకటించడం సరికాదన్నారు. ఇది ఎన్నికల కమిషన్ ఆదేశాలను ఉల్లంఘించడమే అన్నారు.

పింఛన్ల కోసం మండుటెండల్లో పండుటాకులను తిప్పడం సబబా అని ప్రశ్నించారు. పింఛన్ల నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామంటున్నారనీ…ఇది ప్రభుత్వ కుట్రలో బాగమేన్నారు. ఈ కుట్రలు, కుతంత్రాల్లో అధికారులు కూడా భాగస్వామ్యం కావడం దురదృష్టకరమన్నారు. సిబ్బంది ఉన్నా ఇంటింటికి పింఛన్‌ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. ఒక్కో వ్యక్తి 45 పింఛన్లు ఇస్తే సరిపోతుందని.. ఎన్నికల అధికారులు చెప్పినా వినే పరిస్థితి లేకుండా పోయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కుంటి సాకులతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈనెపమును తమపై మోపి ఎన్నికల్లో లబ్ధి పొందాలని వైసీపీ ప్రభుత్వం ఇలాంటి డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. గులకరాయి డ్రామా ప్రజలు ఇప్పటికే తెలుసుకున్నారన్నారు. ఇప్పుడు తెరపైకి మరో డ్రామా చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

45డిగ్రీల ఎండలో ఎక్కడో బ్యాంకులో వేస్తే సుధూర ప్రాంతాలకు వెళ్లి పెన్షన్ దారులు ఎక్కడ తెచ్చుకోగలుగుతారని ప్రశ్నించారు. ఈ ఎండలకు వెళ్తే.. వారికి ప్రమాదం పొంచి ఉందన్నారు. రేపు జరగరానిది జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఎవరైనా చనిపోయినా ఇది ప్రభుత్వ హత్యగా భావించాల్సి వస్తుందన్నారు. ఇంటి వద్దే పింఛన్లు ఇవ్వాలని తాము గట్టిగా డిమాండ్‌ చేశామన్నారు.…కానీ అధికార యంత్రాంగం ప్రభుత్వానికి వత్తాసు పలుకుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ తీరుతో గత నెలలో 33మంది వృద్ధులు ప్రాణాలు కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ హత్యల్లో కొందరు అధికారులు భాగస్వాములయ్యారని మండిపడ్డారు.

- Advertisement -

ఒక పార్టీ ప్రలోభాల కోసం అధికారులు పనిచేయడం తప్పు అని చంద్రబాబు ఖండించారు. ఇంటి వద్ద పెన్షన్లు పంపిణీ చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పంచాయతీ పరిధిలో ఒక్కో ఉద్యోగి 45 మందికి మాత్రమే పెన్షన్ ఇస్తాడన్నారు. పంచాయతీ ఆఫీసుల్లో ఇచ్చేదే ఇంటి వద్ద ఇస్తారు. ఇందులో తప్పేముంది ? అని చంద్రబాబు ప్రశ్నించారు. పెన్షన్ల నగదును బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామంటున్నారని, అయితే పెన్షన్ తీసుకునే అందరి దగ్గర ఫోన్లు ఉండవు కదా అని చంద్రబాబు ప్రశ్నించారు. బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ అయ్యిందో లేదో ఎలా తెలుస్తుందని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామంటూ మరో కొత్త డ్రామాకు తెరదించామని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలాంటి ప్రభుత్వ యంత్రాంగం ఎంతో ప్రమాదకరమని, ఎన్నికల సంఘం కూడా చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలని ఆకాంక్షించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అన్ని పార్టీలు ఒక్క‌టేనని, అన్ని పార్టీలకు సమాన అవకాశాలు ఉంటాయని చంద్రబాబు గుర్తు చేశారు. ముఖ్యమంత్రి ఒక్కడే ప్రభుత్వాన్ని, యంత్రాంగాన్ని వాడుకోవచ్చు. బస్సులు వాడుకోవచ్చు. గ్రౌండ్ వాడుకోవచ్చు అంటే కుదరదన్నారు. సభలకు బెదిరించి ఎక్కువ మందిని తీసుకురావొచ్చని అనుకుంటున్నారు. ఇవన్నీ జరగడానికి వీల్లేదన్నారు. కావున ప్రజలు వీటిని గుర్తించి ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధి చెప్పాలని ఆయన సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement