ఏపీలో కరోనా సెకండ్ వేవ్ నుంచి కోలుకోకముందే..థర్డ్ వేవ్ టెన్షన్ పెడుతోంది. ప్రస్తుతం రాష్ట్రాల్లో కరోనా ఉద్ధృతి తగ్గింది. గడిచిన వారం రోజులుగా 10 వేలలోపు కేసులు మాత్రం నమోదు అవుతున్నాయి. అయితే, మరణాలు మాత్రం తగ్గడం లేదు. ప్రతిరోజులు 90 మందికిపైగానే ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, మూడో దశ పిల్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్యుల నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏపీలో రెండో దశ ముగింపు కాకుండానే మూడో దశలోకి కరోనా ప్రవేశించిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలోకి థర్డ్ వేవ్ ప్రవేశించిందని ప్రచారం జరుగుతోంది. థర్డ్ వేవ్ సంకేతాలు చిత్తూరు జిల్లాలో బారీగా కనిపిస్తున్నాయి. పదుల సంఖ్యలో చిన్నారులు కరోనా నిర్ధారణతో ఆసుపత్రుల్లో అడ్మిట్ అవుతున్నారు. ఒక్క తిరుపతి ప్రాంతంలో ఇప్పటికే 10 మందికి పైగా కరోనా బారిన పడ్డట్లు తెలుస్తోంది, నగరి నియోజకవర్గంలోని పుత్తూరులో మరో 5 కేసులు నమోదు అయినట్లు ప్రభుత్వ గణంకాలే చెబుతున్నాయి. ప్రస్తుతం రుయా ఆసుపత్రి చిన్న పిల్లల వార్డులో 10 మంది చిన్నారులు వైద్య చికిత్స పొందారు. గర్భిణీలు, చిన్నపిల్లల తల్లితండ్రులు చాల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
మరోవైపు కరోనా థర్డ్ వేవ్ పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. మూడో దశపై అనాలసిస్, డేటాలను సీఎంకు అధికారులు వివరించారు. థర్డ్ వేవ్ వస్తుందా? లేదా? అన్నదానిపై శాస్త్రీయ నిర్ధారణ లేదని ఈ సందర్భంగా సీఎం జగన్‌కు అధికారులు వెల్లడించారు. ఒకవేళ థర్డ్ వేవ్ వస్తే తలెత్తే పరిణామాలు, ప్రభావితమయ్యే వారి వివరాలపై అంచనాలను జగన్‌కి వివరించారు. పోషకాహార కార్యక్రమం కొనసాగాలని, టీకాల కార్యక్రమం కూడా కొనసాగించాలని అధికారులు కోరారు. వినియోగించాల్సిన మందులు, పరికరాలు, బయోమెడికల్ ఎక్విప్‌మెంట్, తదితర అంశాలపైనా ముఖ్యమంత్రితో అధికారులు చర్చించారు.
థర్డ్ వేవ్ వస్తే పిల్లలపై ప్రభావం, తీవ్రత ఎలా ఉంటుందనే అంశాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. పీడియాట్రిక్ సింప్టమ్స్‌ను గుర్తించడానికి ఆశా, ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలన్నారు. అన్ని టీచింగ్ ఆస్పత్రుల్లో పీడియాట్రిక్ వార్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. థర్డ్ వేవ్ వస్తుందనుకుని కావాల్సిన మందులు ముందే తెచ్చి పెట్టుకోవాలని సీఎం ఆదేశించారు. పిల్లల డాక్టర్లను గుర్తించాలని, వారిని రిక్రూట్ చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. చిన్న పిల్లల కోసం మూడు నూతన ఆస్పత్రులు నిర్మించాలని, వాటిలో అత్యుత్తమ వైద్య సేవలు అందించడానికి ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ఒకటి వైజాగ్‌లో, రెండోది కృష్ణా–గుంటూరు ప్రాంతంలో, మూడోది తిరుపతిల్లో అత్యుత్తమ పీడియాట్రిక్ కేర్ సెంటర్‌లను ఏర్పాటు చేయాలన్నారు. దాదాపు రూ.180 కోట్ల చొప్పున ఒక్కో ఆస్పత్రి నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. ప్రైవేటు టీచింగ్ ఆస్పత్రులకు కూడా థర్డ్ వేవ్ పై సమాచారం ఇచ్చి సన్నద్ధం చేయాలన్నారు. ఆస్పత్రుల వారీగా ఏర్పాటు చేయదలచిన ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లపై కూడా దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. వీటికి సంబంధించి జరుగుతున్న పనులపై తనకు ఎప్పటికప్పుడు నివేదించాలన్నారు.
ఇది కూడా చదవండి: ఈటల బాటలో కోమటిరెడ్డి… బీజేపీలో చేరేది ఎప్పుడో ?