Tuesday, November 19, 2024

AP | కరోనా డేంజర్‌ బెల్స్.. తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఎక్కువ కేసులు

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో కోవిడ్‌ కేసులు మరోమారు పెరుగుతున్నాయి. ఇదే అంశం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి ప్రతి వారం జిల్లాల వారీగా విడుదల చేసిన కేసుల సంఖ్య, రేటు అంశాలు ఈ అంశాన్ని ధృవీకరిస్తున్నాయి. రాష్ట్రంలోని తూర్పు గోదావరి మరియు కృష్ణా జిల్లాల్లో కోవిడ్‌ పాజిటివిటీ- రేటు- 10 శాతానికి మించి ఉంది. తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలు వరుసగా 13.30 శాతం, 10.75 శాతం వంతున పాజిటివిటీ రేటును పొందాయి. ఇక పశ్చిమ గోదావరి 9.37 శాతం, విశాఖపట్నం 8.70 శాతం, గుంటూరు 6.40 శాతం నమోదయ్యాయి. మిగిలిన అన్ని జిల్లాలు ఐదు శాతం కంటే తక్కువ రేటు-ను నమోదు చేశాయి. మంగళవారం నాటికి రాష్ట్రంలో 394 కోవిడ్‌ -19 పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని అధికారులు గుర్తించారు. ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి కేసుల సంఖ్యను నిలువరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏపీలో పెరుగుతున్న కేసులు
ఇతర రాష్ట్రాలతో పాటు- ఏపీలోనూ కరోనా కేసులు నమోదవుతున్నాయి. దాదాపు 85 శాతం నుండి 95 శాతం వరకు ఇటు-వంటి కేసులు ఎక్స్‌బీబీ.1.16 వంటి ఉప వేరియంట్లకు సంబంధించినవిగా గుర్తించారు. ఈ నేపథ్యంలో గుంటూరులో ప్రస్తుతం ఉన్న స్టేట్‌ వైరల్‌ రీసెర్చ్‌ అండ్‌ డయాగ్నస్టిక్‌ ల్యాబ్‌ను ‘హోల్‌ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌’గా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, బయో-టె-క్నాలజీ విభాగం, కౌన్సిల్‌ ఫర్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ మరియు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ సంయుక్త కలయికతో కూడిన ఇండియన్‌ ఎస్‌ఏఆర్‌ఎస్‌-కోవి2 జెనోమిక్స్‌ కన్సార్టియం నుండి త్వరలో అనుమతి పొందాలని భావిస్తోంది.

రెండో హోల్‌ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటు
ఇదిలా ఉండగా రాష్ట్రంలో మరో హోల్‌ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌ను గుంటూరులో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు గుంటూరులో ఏర్పాటు చేయబోయే ఈల్యాబ్‌లో వారానికి 192 నమూనాలను పరీక్షించే సామర్థ్యంతో హోల్‌ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటు- కానుంది. విజయవాడ నగరంలోని ప్రభుత్వ సిద్దార్థ వైద్య కళాశాల ప్రాంగణంలో జనవరి 1, 2022న రాష్ట్రంలో మొట్టమొదటి హోల్‌ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌ను ఏర్పాటు- చేసింది. ఇది వారానికి 192 నమూనాలను పరీక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. తదనంతరం, జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం 3 వేల కోవిడ్‌ నమూనాలను పరీక్షించడంతో పాటు-, ఇక్కడి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌కు రియాజెంట్లు- మరియు ముడి పదార్థాలను సరఫరా చేయడానికి హైదరాబాద్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

అన్నీ ఎక్స్‌బీబీ 1.16 వేరియంట్‌లే
హోల్‌ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌ అధికారులు మాట్లాడుతూ, ఎక్స్‌బీబీ.1.16 వంటి సబ్‌-వేరియంట్ల వల్ల ఎక్కువ కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు వస్తున్నాయని కనుగొన్నామని చెప్పారు. ఈనేపథ్యంలోనే విజయవాడ ల్యాబ్‌తోపాటు గుంటూరులో మరో హోల్‌ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌ రానుంది. దీంతో గుంటూరులో కొత్తగా ఏర్పాటు కాబోయే ల్యాబ్‌లో సబ్‌ వేరియంట్లను గుర్తించడానికి, మరిన్ని నమూనాలను పరీక్షించడంలోనూ సహాయపడనుందని తెలిపారు. గుంటూరులో కొత్తగా ఏర్పాటుచేయబోయే ల్యాబ్‌కు వివిధ ఏజెన్సీల నుండి అనుమతులు తీసుకోవడం ద్వారా ఇప్పటికే ఉన్న వీఆర్డీఎల్‌ అభివృద్ధి చెెసినట్లవుతుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement