( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో ) : అమరావతి రాజధాని ప్రాంతంలోని అతిపెద్ద, ప్రాచీన దేవాలయం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం అభివృద్ధికి ప్రసాద్ పథకం కింద రూ.100 కోట్లు మంజూరు విషయంపై కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఆయన నివాసంలో గురువారం కలిశారు.
కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ కి ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించడంతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహుకరించారు. అనంతరం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ తో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం అభివృద్ది అంశంపై మరోసారి చర్చించారు. ఈ దేవాలయం అభివృద్ది కోసం ప్రసాద్ పథకం కింద రూ.100 కోట్లు విడుదల చేయాలని ఆగస్టులో చేసిన విజ్ఞప్తిపై త్వరితగతిన చర్యలు తీసుకుని..ఆ నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ లో రెండవ అతిపెద్ద దేవాలయంగా ప్రసిద్ధి గాంచిన విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంకు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తుల తాకిడి బాగా పెరిగిందని, అందుకోసం ప్రసాద్ పథకం కింద రూ.100కోట్లు మంజూరు చేయిస్తే భవిష్యత్తు కాలంలో భక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారి అవసరాలు తీర్చే విధంగా మెరుగైన సౌకర్యాలు, సదుపాయాలు కల్పించడంతో పాటు ఆలయ అభివృద్దికి కృషి చేస్తామని ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. ఈ మేరకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ సానుకూలంగా స్పందించటమే కాకుండా సంబంధిత అధికారులకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు.