(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : అమరావతి రాజధాని ప్రాంతంలోని అతిపెద్ద, ప్రాచీన దేవాలయం శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఆలయ అభివృద్దికి ప్రసాద్ (PRASAD -Pilgrimage Rejuvenation and Spiritual Augmentation Drive ) పథకం కింద వంద కోట్ల రూపాయలు మంజూరు చేయాలని విజయవాడ ఎం.పి కేశినేని శివనాథ్ గురువారం కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.
ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించేందుకు వచ్చే భక్తుల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని చేపట్టాల్సిన అభివృద్ది కార్యక్రమాలు, నిర్మాణాల ప్రతిపాదనల వివరాలు వినతిపత్రంలో వివరించారు. ఇప్పటికే రెవెన్యూ (దేవాదాయ) శాఖ, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఆలయ ఈవో పత్రిపాదనలు పంపించిన విషయం తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల దేవస్థానం తరువాత అతిపెద్ద దేవస్థానంగా శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రసిద్ధి పొందిన విషయం చెప్పారు. రోజుకి అమ్మవారిని 25,000 మంది భక్తులు సందర్శిస్తారని, శుక్రవారం, శనివారం, ఆదివారాలలో 50,000 మందికి పైగా భక్తులు తరలివస్తారని వివరించారు.
అలాగే దసరా నవరాత్రులు, భవానీ దీక్ష విరమణ సమయంలో పలు రాష్ట్రాల నుంచి 2,50,000 మందికి పైగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని చెప్పారు. భక్తులకి అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు, ఆలయ అభివృద్దికి ప్రసాద్ పథకం కింద రూ.100 కోట్లు మంజూరు చేయించాలని కోరారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అభ్యర్ధనపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ సానుకూలంగా స్పందించారు.