Saturday, November 23, 2024

సభా కార్యక్రమాలకు సహకరించండి.. సస్పెండ్‌ అవుతామంటే మీ ఇష్టం : జగన్‌

అమరావతి, ఆంధ్రప్రభ: ‘మున్సిపాలిటీ.. మొత్తం జనాభా 55వేలు. పైగా వార్డు కౌన్సిలర్లు, పోలీసు స్టేషన్‌, వార్డు సచివాలయం, మహళా పోలీసులు ఉన్న జంగారెడ్డిగూడెంలో సారా కాయగలరా? సభ జరపకూడదన్న ఆలోచన పక్కన పెట్టి కాస్త బుర్రపెట్టి లాజిక్‌గా ఆలోచించండి’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన రెడ్డి ఆందోళన చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జంగారెడ్డిగూడంలో నాటుసారా మరణాలపై చర్చించేందుకు తామిచ్చిన వాయిదా తీర్మాణం ఆమోదించాలంటూ వరుసగా రెండో రోజు కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ తెదేపా సభ్యులు ప్రస్తావిస్తున్న వాటిపై తనకు కొన్ని సందేహాలు ఉన్నట్లు పేర్కొన్నారు. మారుమూల గ్రామంలోనో, నిర్జన ప్రదేశంలోనో సారా కాస్తున్నారంటే నమ్మొచ్చు కాని జంగారెడ్డిగూడెం వంటి పట్టణంలో సాధ్యమా? అని సీఎం ప్రశ్నించారు. తెదేపా సభ్యులు ఆరోపిస్తున్న సారా కాసే వారికి అండగా ఉండాల్సిన అవసరం తమకు లేదంటూ ఎస్‌ఈబీని ఏర్పాటు చేసి కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. అక్రమ మద్యంపై ఇప్పటి వరకు 13వేల కేసులు నమోదు చేయడమే తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. మద్యం విషయంలో చంద్రబాబు నాయుడు తన మాటలతో తానే విబేధిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర బేవరేజెస్‌ కార్పోరేషన్‌ ద్వారా ప్రభుత్వం రూ.25 వేల కోట్లు అప్పు తెచ్చి, మరో 25వేల కోట్లు తెచ్చేందుకు సిద్ధం అవుతున్నామని చెపుతూనే మరోవైపు సారా తాగి మనుషులు చనిపోతున్నారంటూ చెపుతున్నారన్నారు. సారా తాగిస్తే ప్రభుత్వ ఆదాయం తగ్గుతుంది కదా? అని సీఎం ప్రశ్నించారు. సహజ మరణాలపై సోమవారం తాను చేసిన వ్యాఖ్యలపై వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారంటూ దేశంలో సహజ మరణాల రేటు 2 శాతంగా ఉన్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయన్నారు. ఇందుకు రకరకాల కారణాలు ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే జంగారెడ్డిగూడెంలో నెలకు 90 సహజ మరణాలు ఉండొచ్చని తాను మాట్లాడానన్నారు. జంగారెడ్డి గూడెంలో వేర్వేరు చోట్ల వారం రోజుల వ్యవధిలో ఆ మరణాలు చోటు చేసుకున్నాయన్నారు. అంత్యక్రియలు కూడా ముగిసినట్లు చెపుతూ సమాచారం రాగానే మృతదేహానికి పోస్టుమార్టం కూడా చేయించామన్నారు. సారా మరణం అయితే పోస్టుమార్టం ఎందుకు చేయిస్తామని అన్నారు. కేవలం అబద్దాలను ప్రజల్లోకి తీసుకెళ్లి నిజమని నమ్మించడమే చంద్రబాబు అండ్‌ కో ప్రయత్నమన్నారు. జరగని విషయంపై విష ప్రచారం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్నారంటూ సీఎం మండిపడ్డారు. రాష్ట్రానికి మంచి చేసేందుకు ప్రతిపక్ష స్థానాల్లో కూర్చొని సలహాలు ఇస్తే స్వీకరిస్తాం తప్ప ఇలా ప్రవర్తించి సభా కార్యక్రమాలను అడ్డుకోవద్దంటూ హితవు పలికారు. బడ్జెట్‌ చర్చలో పాల్గొని సలహాలు ఇస్తే నోట్‌ చేసుకుంటామని సీఎం జగన్మోహన రెడ్డి పేర్కొన్నారు. లేదు ఇలాగే ఉంటామంటే మీ ఇష్టమని, ఇప్పుడు ఒక రూల్‌ ప్రస్తావించారని చెపుతూ ఆ ప్రకారం సస్పెండ్‌ అవుతామంటే మీ ఇష్టమని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement