న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కొత్తగా ఏర్పాటైన పల్నాడు జిల్లాలో నరసరావుపేటకు చేరువలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్ప కొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి సహకరించాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో మంత్రిని కలిసి దేవాలయ అభివృద్ధిపై చర్చించి వినతిపత్రం సమర్పించారు. దక్షిణాదిలో ప్రముఖ శైవ క్షేత్రంగా కోటప్ప కొండ క్షేత్రం వెలుగొందుతోందని, పెద్దసంఖ్యలో భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తుంటారని ఆయన తెలిపారు.
ఈ ఆలయాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రసాద్ (తీర్థయాత్ర పునరుజ్జీవనం, ఆధ్యాత్మిక వృద్ధి డ్రైవ్) పథకంలో చేర్చి, తగిన నిధులను కేటాయించాలని శ్రీకృష్ణదేవరాయలు కోరారు. దేశంలోని గొప్ప దేవాలయాలను, పుణ్య క్షేత్రాలను గుర్తించడం, దేవాలయాల పునరుద్ధరణ, క్రమ పద్దతిలో అభివృద్ధి చేయడం కోసం ఏర్పాటు చేసిన ప్రసాద్ పథకం కింద చేర్చాలని కిషన్‌రెడ్డిని కోరారు. కోటప్ప కొండ క్షేత్రానికి శతాబ్దాల చరిత్ర ఉందని, అప్పట్లో శ్రీకృష్ణ దేవరాయల వంశస్థులు ఈ క్షేత్రం విరాజిల్లడానికి ఎంతగానో కృషి చేశారని ఎంపీ గుర్తు చేశారు. కోటప్ప కొండతో పాటు నరసరావుపేట పట్టణంలో పర్యాటకాభివృద్ధికీ సహకరించవలసినదిగా శ్రీకృష్ణదేవరాయలు కేంద్రమంత్రిని కోరారు.