Tuesday, November 19, 2024

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 30 గంటలు

తిరుమల, ప్రభన్యూస్‌ : తిరుమల గిరుల్లో భక్తుల రద్దీ కూడా కొనసాగుతోంది. శనివారం ఔట్‌ రింగ్‌రోడ్డు, శిలాతోరణం, క్యూ లైన్‌లు కొనసాగుతున్నాయి. వరుస సెలవులతో పాటు వారాంతపు రద్దీతో దేశం నలుమూలల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులతో తిరుమలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీవారి దర్శనం కోసం టికెట్‌లేని భక్తులకు దాదాపు 30 గంటలు సమయం పడుతుంది. కాగా మాతృశ్రీ తరిగొండవెంగమాంబ అన్నప్రసాద భవనం, అన్నప్రసాదం కౌంటర్లు, నారాయణగిరి ఉద్యానాలు, భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో ఆహారం, పాలు, తాగునీరు అందించేందుకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేసింది. శ్రీవారి సేవకులు అన్నప్రసాదం, ఆరోగ్య, విజిలెన్స్‌ విభాగాలు ప్రత్యేక దృష్టిసారించి అన్ని కీలక ప్రదేశాల్లో సేవలందిస్తున్నారు.

అలాగే మాతృశ్రీ తరిగొండవెంగమాంబ అన్నప్రసాద సముదాయంలోనే శనవారం మధ్యాహ్నానికి దాదాపు 79 వేలమందికి పైగా అన్నప్రసాదం అందించగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ క్యూ లైన్‌లలో 80 వేల మందికి అన్నప్రసాదాలు (ఇందులో పాలు, ఉప్మా, పొంగల్‌) లు పంపిణీ చేశారు. సాధారణం కంటే రెట్టింపుగా అన్నప్రసాదాలు అందించారు. అంతే కాకుండా చంటిపిల్లలకు ఎప్పటికప్పుడు పాలు అందిస్తున్నారు. క్యూ లైన్‌లలో ఎలాంటి తొక్కిసలాటలు జరగకుండా విజిలెన్స్‌, పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

శనివారం సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 50 వేలమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల అధిక రద్దీ కారణంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఎస్‌ఎస్‌డి టోకెన్లు, దివ్యదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు మాత్రమే తిరుమలకు రావాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. ఈవో ఏవి.ధర్మారెడ్డి ఆదేశాల మేరకు జేఈవో వీరభ్రహ్మం ఆధ్వర్యంలో ఇంజనీరింగ్‌, ఆరోగ్యం, అన్నప్రసాదం, విజిలెన్స్‌, వైద్యశాఖల ఉన్నతాధికాలు భక్తుల సౌకర్యాలను, క్యూ లైన్‌లను నిరంతరాయంగా పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement