Friday, November 22, 2024

రిసార్ట్ ఉన్న ప్రాంతంలోనే నిర్మాణాలు, కొత్తగా తవ్విన ద‌గ్గ‌ర‌ వ‌ద్దు.. రుషికొండ కేసు హైకోర్టుకు బదిలీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రుషికొండ ప్రాజెక్టు కేసు విచారణ హైకోర్టుకు బదిలీ అయింది. ట్రిబ్యునల్ పరిధి కంటే హైకోర్టు పరిధి ఎక్కువని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రుషికొండ తవ్వకాల అంశంపై బుధవారం విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు ఆదేశించినప్పటికీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బేఖాతరు చేయడం తగదని హితవు పలికింది. హైకోర్టు, ఎన్జీటీ పరస్పర విరుద్ధ ఆదేశాలతో యంత్రాంగం గందరగోళంలో ఉందని అభిప్రాయపడింది. హైకోర్టు రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి, హైకోర్టు ఉత్తర్వులే అమలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అప్పటివరకు ఎన్జీటీలో విచారణ జరపరాదని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఎన్జీటీలో జరిగే విచారణను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఆర్థిక వ్యవస్థ బలోపేతం ఎంత ముఖ్యమో… పర్యావరణం అంతే ముఖ్యమని కీలక వ్యాఖ్యలు చేసింది. భవిష్యత్ తరాలకు కాలుష్య రహిత వాతావరాణాన్ని అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేసింది. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది కాబట్టి తదుపరి విచారణ హైకోర్టులో జరుగుతుందని, పిటిషనర్ల అభ్యంతరాలు అక్కడ చెప్పుకోవాలని సూచించింది.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభిషేక్‌ సింఘ్వీ వాదనలు నమోదు చేస్తున్నట్లు తెలిపిన ధర్మాసనం, అవసరమనుకుంటే హైకోర్టు మరో కమిటీ నియమించుకోవచ్చని వ్యాఖ్యానించింది. ఎన్జీటీ భావించిన విధంగా హైకోర్టు మరో నిపుణుల కమిటీ నియమించుకోవచ్చని చెప్పింది. ప్రభుత్వం తరఫు న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ రుషికొండలో 62 ఎకరాల్లో 9.2 ఎకరాల్లోనే నిర్మాణం చేపట్టామని అన్నారు. గతంలో ఉన్న రిసార్టు ప్రాంతంతో పాటు మరికొంత విస్తరిస్తున్నామని వాదించారు. 190 వృక్షాలే తీసేశారని అభిషేక్‌ సింఘ్వి చెప్పారు. రుషికొండ విస్తరణ వ్యవహారంపై అభిషేక్‌ సింఘ్వీతో ధర్మాసనం విభేదించింది. హైకోర్టులో కేసు విచారణ పూర్తయ్యేవరకు తవ్వకాలు జరిపిన ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశించింది. గతంలో రిసార్టు ఉన్న ప్రాంతంలో పాత భవనాలు తొలగించిన చోట మాత్రం నిర్మాణాలు జరపడానికి వెసులుబాటు కల్పించింది. ప్రతివాదిగా ఉన్న రఘురామ హైకోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో చెప్పిన విషయాలన్నీ హైకోర్టుకు కూడా చెప్పాలని తెలిపింది. హైకోర్టు వాటన్నింటిని పరిగణనలోకి తీసుకుంటుందని వ్యాఖ్యానించింది. వీలైనంత త్వరగా విచారణ చేపట్టాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రుషికొండ టూరిజం ప్రాజెక్టు సీఆర్‌జెడ్ నిబంధనలు ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ ఎంపీ రఘురామకృష్ణ రాజు గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు లేఖ రాశారు. ఈ లేఖపై ఏపీ ప్రభుత్వ వాదనలు వినకుండానే ఎన్జీటీ స్టే ఉత్తర్వులిచ్చింది. అనంతరం ఏపీ ప్రభుత్వం ప్రతివాదిగా చేరి తమ వాదనలు వినిపించినప్పటికీ, స్టే తొలగించలేదు. దీంతో ఎన్జీటీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement