న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణంలో ఉన్న వివిధ రోడ్ల నిర్మాణాలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. చిన్నఅవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు (30 కి.మీ) 6 లేన్ల ప్రాజెక్టు ను రూ. 1,148.4 కోట్ల అంచనా వ్యయంతో మేఘా ఇంజనీరింగ్ సంస్థకు ప్రాజెక్టు అప్పగించామని, ఇప్పటి వరకు 23 శాతం పనులు పూర్తయ్యాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. విజయవాడ బైపాస్ రోడ్ల గురించి లోక్‌సభలో వైఎస్సార్సీపీ వల్లభనేని బాలశౌరి ప్రశ్నలకు ఆయన జవాబిచ్చారు.
కోవిడ్-19 కారణంగా జులై 17నాటికి పూర్తికావాల్సిన పనులు స్వల్ప జాప్యంతో అక్టోబర్ 13కు పూర్తయ్యాయని అన్నారు. 2023 ఫిబ్రవరి 17 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని చెప్పారు. గొల్లపూడి – చిన్నకాకాని (17.88 కి.మీ) 6 లేన్ల ప్రాజెక్టుకు రూ. 1,546.31 కోట్ల అంచనా వ్యయంతో విజయవాడ బైపాస్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగించామన్నారు. 3.36 శాతం పనులు పూర్తయ్యాయని, కోవిడ్ కారణంగా జాప్యం లేకపోయినా, ఎడతెరిపిలేని వర్షాల కారణంగా 2-3 నెలల జాప్యం ఏర్పడిందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు 2024 జనవరి 4 నాటికి పూర్తయ్యేలా టార్గెట్ ఉందని నితిన్ గడ్కరీ జవాబులో పేర్కొన్నారు.