Thursday, November 21, 2024

AP | మచిలీపట్నంలో పోర్టు నిర్మాణం.. ఫిబ్ర‌వ‌రిలో పనులు ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌

మచిలీపట్నం, ప్రభ న్యూస్‌: కృష్ణా జిల్లావాసుల చిరకాల స్వప్నమైన మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు జనవరి చివరి వారంలో గానీ, ఫిబ్రవరి మొదటి వారంలో గానీ ప్రారంభించనున్నట్లు మాజీ మంత్రి, మచిలీపట్నం శాసనసభ్యుడు, పేర్ని నాని స్పష్టం చేశారు. బుధవారం కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం ఆర్‌ అండ్‌ బి అతిథి గృహంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పోర్టు నిర్మాణానికి రూ.5,253 కోట్లు వ్యయం అవుతున్న‌ట్టు అంచనా వేశామ‌ని చెప్పారు. ప్రభుత్వానికి చెందిన 1,730 ఎకరాల భూమిలో మొదటి దశ పనులు ప్రారంభిస్తామని, తొలుత 4 బెర్తులు నిర్మాణం చేపట్టనున్నామని, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

పోర్టు నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 25 శాతం, ప్రైవేట్‌ వాటా 75 శాతం చొప్పున ఒప్పందం జరిగిందని, జాతీయ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ పోర్టు నిర్మాణానికి రూ. 3,940 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పోర్టు నిర్మాణం పూర్తయితే 80 వేల టన్నుల బరువుతో వచ్చే ఓడలు సైతం సురక్షితంగా రాగలుగుతాయన్నారు. లక్ష నుంచి లక్షన్నర బరువుతో ఉండే ఓడలు వచ్చే బెర్తులను రెండో దశలో నిర్మించనున్నట్లు చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి పర్యావరణ అనుమతులు రాగానే నేరుగా పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టు-కున్నట్లు చెప్పారు. రెండు, మూడు వారాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి పర్యావరణ అనుమతులు వస్తాయన్నారు. అనుమతులు వచ్చిన వెంటనే జనవరి చివరి వారంలో గాని, ఫిబ్రవరి మొదటి వారంలో మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించనున్నట్లు- పేర్ని నాని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement