పోలవరం ,(ఏలూరు) ప్రభన్యూస్ : పోలవరం ప్రాజెక్ట్‌ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయటమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర జలవనరులు శాఖా మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను గురువారం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు 3 గంటలపాటు ప్రాజెక్ట్ నిర్మాణ పనుల పురోగతిని ప్రాజెక్ట్ అధికారులతో కలిసి పరిశీలించారు. తొలుత పోలవరం తాగునీటి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. అనంతరం రెగ్యులేటర్, ట్విన్ టన్నెల్స్, ముల్లంక డంపింగ్ యార్డు, కడియమ్మ స్లూయిస్ ను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్ట్ సమావేశ మందిరంలో ప్రాజెక్ట్ పనుల పురోగతి మరియు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ప్రాజెక్ట్ పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అదే విధంగా ట్విన్ టన్నెల్స్ యొక్క పురోగతిని, పెండింగ్ పనులకు రూపొందించిన యాక్షన్ ప్లాన్ ను మంత్రికి తెలియజేశారు. మంత్రి అంబటి రాంబాబు అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ అధికారులు, ఏజెన్సీ వారు సమన్వయంతో ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సూచించారు.
రానున్న వర్షాకాలం దృష్ట్యా రైట్ మెయిన్ కెనాల్‌కు గ్రావిటీ ద్వారా నీటిని సరఫరా చేసే దిశగా చర్యలు తీసుకోవలసినదిగా అధికారులను ఆదేశించారు. అలాగే అప్రోచ్ ఛానల్ పనులను కూడా త్వరితగతిన పూర్తిచేయాలని అన్నారు. తదుపరి లెప్ట్n మెయిన్ కెనాల్ పనుల పురోగతి పై ఆరా తీశారు. ఈ పనులను కూడా సకాలంలో పూర్తిచేయాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్ దశలవారీ గా పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ గురించి మాట్లాడుతూ, అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన ఆర్ అండ్ ఆర్ కాలనీలను నిర్వాసితులకు అందించేందుకు సంబంధిత అధికారులను చర్యలు తీసుకోవలసినదిగా మంత్రి ఆదేశించారు.ఈ సమావేశంలో శాసనసభ్యులు టి. బాలరాజు, ఈ ఎన్ సి. ఇరిగేషన్ సి నారాయణ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ సుధాకర్ బాబు, అడ్మిన్ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్ సంతోష్ కుమార్, ఎస్. ఈ. యాదవ, క్వాలిటీ కంట్రోల్ ఎస్.సి. శ్రీ రామచంద్ర రావు, ఎంపీపీ ఎస్ వి రెడ్డి, ఆర్డీవో ఝాన్సీ రాణి, ప్రాజెక్టు డి ఇ లు,ఇ.ఇ.లు, తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..