అమరావతి, ఆంధ్రప్రభ: ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి ముహూర్తం కుదిరింది. ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్ రెడ్డి బుధవారం పోర్ట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మూలపేట పోర్ట్ నిర్మాణం పూర్తయితే వెనకబడిన ప్రాంతంగా ముద్ర పడిన శ్రీకాకుళం జిల్లాకు మహర్దశ పడుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. సుమారు రూ.3000 కోట్ల రూపాయలతో 230 ఎకరాలలో పోర్టు నిర్మాణాన్ని చేపట్టనున్నారు. పోర్టు నిర్మాణానికి కావలసిన భూమిని సేకరించి సిద్ధంగా ఉంచారు. రాష్ట్రంలో విశాఖపట్నం పోర్ట్ తర్వాత మూలపేట పోర్ట్‌కు ఆస్థాయి ప్రాధాన్యత దక్కేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. మూలపేట పోర్టు అందుబాటులోకి వస్తే శ్రీకాకుళం ప్రాంత రూపురేఖలు మారిపోనున్నాయి. రానున్న రోజుల్లో శ్రీకాకుళం పోర్టు సిటీగా మారబోతుంది.
గత ప్రభుత్వం ఈ పోర్టుకు ఎటువంటి అనుమతులు రాకుండానే శంకుస్థాపన చేసింది. దీంతో పనుల్లో ఒక్క అడుగుకూడ కదల్లేదు. వైసీపీ ప్రభుత్వ హయంలో సీఎం వైఎస్ జగన్ మూలపేట పోర్ట్ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు. నిర్మాణానికి కావాల్సిన స్థల సేకరణ పూర్తి చేశారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి నిధుల్ని ప్రభుత్వం సమకూరుస్తోంది. పోర్ట్ నిర్మాణం పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కడంతో పాటు ఆ ప్రాంతం వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
కీలకం కానున్న మూలపేట పోర్ట్..
శ్రీకాకుళం జిల్లాకు ఆశాకిరణమైన మూలపేట మేజర్ పోర్ట్ నిర్మాణ పనులకు రంగం సిద్ధమైంది. కేవలం మన రాష్ట్రం నుంచే కాకుండా చత్తీస్‌గడ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, దక్షిణ ఒడిస్సా రాష్ట్రాల నుంచి ఎగుమతులు దిగుమతులకు ఈ పోర్ట్ అత్యంత కీలకం కానుంది. రూ.16 వేల కోట్ల వ్యయంతో రాష్రంలో కొత్తగా నిర్మిస్తున్న పోర్టుల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం మూలపేట పోర్ట్ కే ఉన్నాయని మారీటైం బోర్డు వర్గాలు అంచనా వేస్తున్నాయి. పలు కీలక పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకులు, ధర్మల్ కోల్, కుకింగ్ కోల్ ఎరువులు ముడి జీడిగింజలు, సున్నపు పరాయి, వంటనూనెల ఎగుమతి., దిగుమతులకు ఈ పోర్ట్ కేంద్రం కానుంది.
ఇక్కడ నుంచి మినరల్ శాండ్, ముడి ఇనుము, జీడిపప్పు, ఫెరో ఉత్పత్తులతో పాటు సోయామిల్, గ్రెనైట్, జ్యూట్ ఐరన్, స్టీల్ ఉత్పత్తులకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ల్యాండ్ లార్డ్ మోడల్ విధానంలో చేపట్టిన పోర్ట్ నిర్మాణపనుల్ని రూ.2949 కోట్ల 70 లక్షలతో కాంట్రాక్ట్ సంస్థకు అప్పగించారు. నాలుగు బెర్త్‌ల నిర్మాణంతో తొలిదశ ఉంటుంది. పోర్ట్ వార్షిక సామర్థ్యం 83.3మిలియన్ టన్నులు కాగా తొలిదశలో 23.5 మిలియన్ టన్నులతో పోర్ట్‌ను అభివృద్ధి చేయనున్నారు. నాలుగు బెర్త్ ల్లో రెండు జనరల్ కార్గో, ఒకటి బొగ్గు మరొకటి కంటైనర్‌తో పాటు ఎగుమతి, దిగుమతులకు వినియోగించుకోనున్నారు.
పేరు మారింది ఇలా..
శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు పోర్టును మూలపేట పోర్టుగా నామకరణం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. పోర్టుకు భూసమీకరణ నిమిత్తం జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ- మూలపేట, విష్ణుచక్రం గ్రామాలకు సంబంధించిన రైతులతో సమావేశం నిర్వహించినప్పుడు గ్రామస్థులు పోర్టు సంబంధింత భూములన్నీ మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లోనే ఉన్నాయని, పోర్టు ప్రతిపాదిత ప్రాంతంలో భావనపాడు లేనందున పోర్టుకు మూలపేట పోర్టుగా పేరు పెట్టాలని కోరడంతో భావనపాడు పోర్ట్ ను మూలపేట పోర్ట్ గా పేరు మార్చారు.