బాపట్ల అర్బన్, (ప్రభ న్యూస్): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పేదలందరికి ఇళ్ల నిర్మాణ పధకం బాపట్ల జిల్లాలో నత్త నడకన సాగుతోంది. వచ్చే ఏడాది జూన్ నెలాఖరు నాటికి వంద శాతం గృహాలు పూర్తి కావాలని ప్రభుత్వం దిశా నిర్దేశం చేసినప్పటికీ క్షేత్ర స్థాయిలో అది సాధ్యమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జిల్లాలో 29399 ఇళ్లకు భూమి పూజ కాగా కేవలం 1215 ఇళ్ళే పూర్తయ్యాయి. ఇంకా 60 శాతం ఇళ్ళు పూర్తి కావాల్సి ఉంది. మరోవైపు బాపట్ల, చీరాల, రేపల్లె మున్సిపాలిటీ- పరిధిలో ఒక్కొక్క పట్టణానికి 2528 గృహాలు నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా కేవలం 670 ఇళ్ళు మాత్రమే నిర్మాణాలకు నోచుకున్నాయి.
సాంకేతిక సమస్యలు..
లబ్ధిదారులు అప్పో సప్పో చేసి ఇళ్ళు కట్టు-కోవాలనుకున్నా వారిని సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలను సీఎఫ్ ఎమ్ ఎస్ కు అనుసంధానం చేయలేదు. 36 వేల ఇళ్లను ఆన్ లైన్లో అనుసంధానం చేయాల్సి ఉండగా కేవలం 16 వేల ఇళ్లను మాత్రమే పూర్తి చేశారు. దీంతో లబ్ధిదారులకు నగదు జమ కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు, గృహ నిర్మాణ అధికారులకు సమన్వయం లేకపోవడంతో ఇళ్ల నిర్మాణాల విషయంలో పలు సమస్యలు తలెత్తుతున్నాయి
1.80 లక్షలతో ఇల్లు కట్టేదెలా..
ప్రభుత్వం గృహ నిర్మాణం కోసం పట్టణాల్లో 1.80 లక్షలు, గ్రామాల్లో 1.50 లక్షలు అందిస్తుంది. మరో 30 వేలు ఉపాధి హామీ పథకం కింద అందిస్తున్నారు. పునాది పూర్తయితే 60 వేలు, స్లాబ్ దశకు వెళ్తే 60 వేలు, స్లాబ్ పూర్తి చేస్తే 30 వేలు, మరుగుదొడ్డి కి 30 వేలు చొప్పున ప్రభుత్వం ఇస్తుంది. అయితే ప్రస్తుతం ఇల్లు కట్టాలంటే 7 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం ఇచ్చే నగదుకు తోడు 5 లక్షలు చేతిలో ఉంటే గాని లబ్ధిదారుడు ఇంటి నిర్మాణం జోలికి రావాలి. ఒకవైపు నిత్యావసర వస్తువులు ధరలు పెరిగి పూట గడవడమే కష్టంగా మారిన తరుణంలో లక్షలు పెట్టి మేమెలా ఇళ్ళు కట్టేది అని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థల సాయం కావాలి సొంతిల్లు కలగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏవైనా స్వచ్ఛంద సంస్థలు సహాయం చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే 1.80 లక్షలకు స్వచ్ఛంద సంస్థల సాయం కూడా తోడైతే తమ సొంతిల్లు కల నెరవేరుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..