అమరావతి,ఆంద్రప్రభ : ఎన్నో వివాదాలను దాటి రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అమరావతిలోని ఆర్-5 జోన్లో పేదలకు ఇళ్ల పట్టాలు కేటాయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా పట్టాల పంపిణీ ఇటీవలే ఒక పండుగలా జరిగింది. అనుకున్నదే తడువుగా అఘమేఘాల మీద లేఅవుట్లను సిద్దంగా చేసి అతి తక్కువ సమయంలోనే పట్టాలను పంపిణీ చేసిన ప్రభుత్వం అంతే స్పీడ్‌గా అక్కడ లబ్దిదారులకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని భావిస్తోంది. ఇక్కడ దాదాపు 50,793 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఇప్పడు వారందిరి చేత ఇళ్లు నిర్మించే పని ప్రభుత్వం చేపట్టబోతోంది. ఇప్పటికే ఈ ఇళ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి మరికొద్ది రోజుల్లో పంపించనుంది.
కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి రాగానే ఇళ్ల నిర్మాణం ప్రారంభించనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పేదలందిరికీ ఇళ్లు పథకం కింద నిర్మిస్తున్న ఇళ్లు మాదిరి కాకుండా ఇక్కడ షీర్వాల్ టెక్నాలజీ పద్దతిలో ఇళ్లు మొదలు పెట్టిన నెల రోజుల్లోనే పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇంటికి కావాల్సిన గోడలను, రూఫ్‌ను బయట పార్టులుగా పార్టులుగా తయారు చేసి ఒకేసారి తెచ్చి అమర్చడాన్నే షీర్వాల్ టెక్నాలజీ అంటారు. చంద్రబాబు సిఎం ఉన్న హాయంలో అమరావతిలో కొన్ని కట్టడాల నిర్మాణానికి ఈ టెక్నాలజీని వాడారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్లు కట్టేందుకు ఈ టెక్నాలజీని ఉపయోగించబోతోంది.
అత్యంత సుందరంగా కాలనీలు
50 వేల ఇళ్ల పట్టాలను పలు కాలనీలుగా నిర్మించనున్నారు. ఈ కాలనీలు ఏవో మురికి వాడలు మాదిరి కాకుండా పక్కా ప్రణాళికతో అత్యంత సుందరంగా నిర్మించనున్నారు. ఒక్క లేవుట్‌లో 38 శాతం స్థలం మాత్రమే ఇళ్ల నిర్మాణానికి ఉపయోగిస్తారు. ఇతర అవసరాల కోసం 9 శాతం, పార్కింగ్ కోసం ఆరు శాతం, ఓపెన్ స్పెస్ కింద 10 శాతం ఉంచుతారు. మిగిలింది రోడ్ల నిర్మాణం కింద పోతోంది. కాలనీల్లో ప్రధాన రహదారులను 40 అడుగుల్లో నిర్మిస్తారు. అంతర్గత రహదారులను 30 అడుగుల్లో నిర్మిస్తారు. ప్రతి కాలనీలో అంగన్వాడీ కేంద్రం, విలేజీ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, పార్కులు ఏర్పాటు చేస్తారు. మొత్తంగా అత్యంత సుందరమైన కాలనీలుగా నిర్మించబోతున్నారు.
లబ్దిదారుల్లో తొలగని అనుమానాలు
ఒక సెంటు ప్లాటు పొందామని లబ్దిదారుల్లో ఆనందం ఉన్నప్పటికీ అది ఎలా ఉపయోగపడుతుందనే దానిపై వారిలో సందేహాలు వ్యక్తమౌతున్నాయి. మంగళగిరి, తాడేప ల్లి, విజయవాడలో నివసిస్తున్న పేదలకు ఇళ్ల పట్టాలను పం పిణీ చేశారు. ఒక వేళ రాజధాని ఏర్పడి ఉంటే సరే కానీ…తాము పనులు చేసుకుంటున్న ప్రాంతాలకు 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆ ప్రాంతంలో ఇళ్లు కట్టుకోని ఏం చేయాలని కొందరు లబ్దిదారులు ప్రశ్నిస్తున్నారు. కోర్టు తీర్పుకు లోబడి ఇళ్ల పట్టాలు ఇచ్చినట్లు పట్టా పత్రంలో కూడా పేర్కొన్నారని, ఒక వేళ కోర్టు వ్యతిరేకంగా తీర్పు నిస్తే ఏం చేయాలనే దానిపై కూడా లబ్దిదారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇళ్లు కట్టడానికి అదనంగా డబ్బులు ఖర్చవుతాయి కనుక ఆ తర్వాత రేటు వస్తే అమ్ముకొని సొమ్ము చేసుకుందామనే ఆలోచనలో మరికొంతమంది లబ్దిదారులు ఉన్నారు. ప్రభుత్వం అయితే వీలైనంత త ్వరగా అందరికీ ఇళ్లు కట్టించి ఇవ్వాలని భావిస్తోంది. అయితే ఎంతమంది లబ్దిదారులు ముందుకు వస్తారనేది ప్రశ్నార్ధకంగా ఉంది.