– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
హైదరాబాద్, ఆంధ్రప్రభ: నల్లమల అటవీ ప్రాంతంలోని ప్రకృతి రమణీయ దృశ్యాలను చూస్తూ, సెలయేళ్ల సవ్వళ్లు వింటూ, పక్షుల కిలకిలారావాలతో కలిసి ప్రయాణించాలనుకునే వారికి ఆ కల నేరవేరనుంది. తెలంగాణ ప్రభుత్వం కృష్ణనదిపై తలపెట్టిన కేబుల్ బ్రిడ్జి నిర్మాణికి ఎట్టకేలకు కేంద్రం ఆమోదించింది. నిధులు కూడా కేటాయించింది. అయితే.. 2009లో అప్పటి సీఎం వైఎస్సార్ ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి బడ్జెట్ లో రూ.50 కోట్లు కేటాయించారు. కేంద్రం నిధులకోసం డీపీఆర్‌ను పంపారు. అప్పటి నుంచి అది కాస్త పెండింగ్ లో పడిపోయింది. ఈ ప్రాజెక్టు డిజైన్ మార్చేసి మరింత ప్రతిష్టాత్మకంగా తీర్చి దిద్దేందుకు రూ. 1,082.56 కోట్ల అంచనావ్యయాన్ని ప్రతిపాదించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 500 కోట్లను కేంద్రం కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలను కలుపుతూ నిర్మించే ఈ ప్రాజెక్టు ప్రకటన అధికారికంగా కేంద్రం ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ కృష్ణానదీయాజమాన్యం బోర్డుకు చేరలేదు. భూసేకరణ, పర్యావరణ అనుమతులకోసం అటవీశాఖను సంప్రదించకపోవడం గమనార్హం. అన్ని అనుమతులతో ఈప్రాజెక్టును ప్రారంభిస్తే 30 నెల్లోలోగా పూర్తి అయ్యే అవకాశాలున్నాయని అధికారులు అంచనావేస్తున్నారు.
సోమశిల – నంద్యాలలను కలిపేలా బ్రిడ్జి..
తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల, ఏపీలోని నంద్యాల జిల్లా లలితా సంగమేశ్వరం మధ్య కృష్ణా నదిపై కేబుల్ కం సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం నిధులు కేటాయించింది. పూర్తిగా నల్లమల దట్టమైన అటవీ ప్రాంతం నుంచి కృష్ణా నదీమీదుగా బ్రిడ్జిపై ప్రయాణం సాగనుంది. ప్రతిపాదిత సోమశిల -సిద్దేశ్వరం వంతెన తెలంగాణ ఏపీలోని రాయలసీమ ప్రాంతాల మధ్య ప్రయాణ దూరాన్ని పెద్ద ఎత్తున తగ్గించనుంది. కాగా, ఇప్పటివరకు సోమశిల నుంచి ఏపీలోని నంద్యాలకు వెళ్లాలంటే పడవ ప్రయాణం మాత్రమే ఉంది. బ్రిడ్జినిర్మాణంతో కాలినడకన వెళ్లేందుకు కూడా అవకాశాలున్నాయి. అలాగే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయితే నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్, ఏపీ నంద్యాల జిల్లా ఆత్మకూర్ మధ్య రోడ్డు మార్గంలో దాదాపుగా 175 కిలోమీటర్లు ఉండగా ఈ వంతెనతో ప్రయాణ దూరం తగ్గుతుందని అధికారులు చెప్పారు.
పర్యాటక రంగానికి ప్రోత్సాహం..
అలాగే హైదరాబాద్ నుంచి తిరుపతి మధ్య దూరం 80 కిలో మీటర్లు తగ్గనుంది. నల్లమల పరిధిలోని శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ పై ఉన్న సుందర మైన ప్రదేశంతో ఈ వంతెన పర్యాటకులను అమితంగా ఆకట్టుకునే అవకాశాలున్నాయని పర్యాటక శాఖ అధికారులు చెప్పారు. ఈ వంతెనపై గాజుతో కూడిన పాదాచారుల నడక మార్గం, ఆలయ గోపురం లాంటి పైలాన్ లు, సిగ్నేచర్ లైటింగ్, పెద్ద నావిగేషన్ స్పాన్ వంటి అనేక ప్రత్యేక ఆకర్షణలను తీర్చిదిద్దనున్నారు. బ్రడ్జి చుట్టూ నల్లమల అడవులు, కొండలు, జలపాతాలతో పాటుగా అందమైన పరిసరాలు, కృష్ణా నదీ సోయగాలను ఎత్తునుంచి చూసే అవకాశాలుండటంతో పర్యాటకరంగం అభివృద్ధి వేగంగా జరిగే అవకాశాలున్నాయి. అయితే కేంద్రం ఆమోదం తెలిపి నిధులు కేటాయించడంతోనే పూర్తి అయ్యే అవకాశాలు లేవు. డీపీఆర్‌కు కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కి పంపి అనుమతులు పొంది ప్రభుత్వశాఖలను సమన్యవయం చేస్తూ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అన్ని అనుమతులతో పనులు ప్రారంభిస్తే 30 నెలల్లో ఈ కేబుల్ కమ్ సస్సెన్షన్ బ్రిడ్జి పూర్తి అయ్యే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.