Tuesday, November 19, 2024

Sharmila : ఏపీలో కుమ్మ‌క్కు రాజ‌కీయాలే.. అధికార‌, విప‌క్ష పార్టీలు బీజేపీకి తొత్తులే..

విశాఖ:

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల అభ్యర్ధుల కోసం దరఖాస్తుల స్వీకరణను ఏపీ కాంగ్రెస్ ప్రారంభించింది. దరఖాస్తుల స్వీకరణను ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్కం ఠాకూర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీ సర్కారుపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్‌ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్‌ షర్మిల అన్నారు. పాలక పక్షం, ప్రతిపక్షం బిజెపికి తొత్తులుగా మారాంటూ ఆరోపించారు. బిజెపితో తో వైసిపి కంటికి కనిపించని పొత్తు పెట్టుకుంద‌ని విమ‌ర్శించారు… ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్‌ గట్టిగా మాట్లాడిన జ‌గ‌న్ ఆ త‌ర్వాత పిల్లిగా మారి సైలెంట్ అయిపోయార‌న్నారు.. బీజేపీతో చంద్రబాబు తెర ముందు పొత్తులు పెట్టుకుంటే… వైసీపీ తెరవెనుక ఒప్పందాలతో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. జగనన్న ఒక్క సారైనా ప్రత్యేక హోదా కోసం మాట్లాడారా అంటూ ప్రశ్నించారు. వైజాగ్ ఉక్కును సర్వనాశనం చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకుందని ప్రశ్నలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వానికి దక్కాల్సిన గంగవరం పోర్టును 600కోట్లకు ఆదానీకి జగన్మోహన్ రెడ్డి అమ్మేశారని ఆమె ఆరోపణలు చేశారు. కుమ్మక్కు కోసం, స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలను రాష్ట్రంను తాకట్టు పెట్టేశారని విమర్శలు గుప్పించారు.

ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు శ్రీకారం

మరో వైపు.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల అభ్యర్ధులకు అప్లికేషన్లను మాణిక్కం ఠాకూర్ ప్రారంభించారు. మొదటి అప్లికేషన్ మడకశిర నుంచి సుధాకర్.. రెండవ అప్లికేషన్ గుంటూరు తూర్పు నుంచీ మస్తాన్ వలీ.. మూడవ అప్లికేషన్ బద్వేల్ నుంచీ కమలమ్మ నుంచి స్వీకరించారు.
ఈ సందర్భంగా మాణిక్కం ఠాకూర్‌ మాట్లాడుతూ.. “కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్ధానాలకు అభ్యర్థులను నిర్ణయిస్తుంది. ప్రతీ కాంగ్రెస్ కార్యకర్తకు అప్లికేషన్ తీసుకునే అవకాశం ఉంది. అప్లికేషన్లు మధుసూధన్ మిస్త్రీ ఆధ్వర్యంలోని స్టీరింగ్ కమిటీ పరిశీలిస్తారు. నిజమైన కాంగ్రెస్‌లోకి మాజీలు రావాలని పిలుస్తున్నాం. ఆర్కే పోటీ చేసే స్ధానం త్వరలో తెలుస్తుంది. ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సూచనల మేరకు అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. క్యాష్ బేస్డ్ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చెయ్యదు. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ త్వరలో ఏపీలో పర్యటన చేస్తుంది. పార్టీ లీడర్స్ ఎవరైనా ఎన్నికలో పోటీ చేసే ఆసక్తి ఉంటే చెయ్యొచ్చు. భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి అడుగులు వెయ్యడానికి కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉంది. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పని చేసే నేతలను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించదు. కాంగ్రెస్ భావజాలం కలిగిన అన్ని పార్టీలలో ఉన్న నేతలను పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నా. ” అని అన్నారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement