తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదంపై ముదురుతోంది. తెలంగాణ మంత్రులు దివంగత మాజీ సీఎం వైఎస్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం పై ఏపీ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణ మంత్రుల వ్యవహారశైలిపై ఏపీ ప్రభుత్వం స్పందించడం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ పై ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ నిప్పులు చెరిగారు. నది జలాల విషయంలో ముఖ్యమంత్రి జగన్ చేసిన అసమర్థత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే ముఖ్యమంత్రి జగన్ మాట్లాడటం లేదని మండిపడ్డారు. జగన్ సోదరి షర్మిల కూడా తెలంగాణకు చెందిన చుక్క నీటిని కూడా విడిచిపెట్టేది లేదని అంటున్నారని పేర్కొన్నారు. నది జలలపై తెలంగాణ మంత్రులు అడ్డగోలు ప్రకటనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్ ఒక దొంగ, నరరూప రాక్షసుడని టిఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్ అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి అయిన జగన్ ఆ వ్యాఖ్యలపై నోరు మెదపడం లేదని మండిపడ్డారు. తెలంగాణలో ఏపీ ప్రజలు ఉన్నారు అందుకే నది జలాల విషయంలో మాట్లాడటం లేదని సిగ్గులేకుండా చెబుతున్నారని విమర్శించారు. తెలంగాణలో ఉన్న మీ ఆస్తులను కాపాడుకోవడానికి జల వివాదాలపై మాట్లాడటం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ ఏపీ ప్రయోజనాలను కేసీఆర్ ముందు తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రైతాంగ హక్కులను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే దమ్ము లేకపోతే మహిళలుగా మేము ముందుకు వచ్చి పోరాటం చేస్తామని సవాల్ విసిరారు.