Friday, November 22, 2024

Congress – మహిళా బిల్లుపై బీజేపీకి చిత్తశుద్ది లేదు.. ఏఐసీసీ అధికార ప్రతినిధి పంకూరి పథక్…

ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో – బీజేపీ కొత్తగా ప్రవేశ పెట్టిన మహిళా బిల్లు రాజకీయ లబ్ది కోసమేనని ఏఐసీసీ అధికార ప్రతినిధి పంకూరి పథక్ విమర్శించారు. విజయవాడలోని ఆంధ‌్రరత్న భవన్ లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజుతో కలిసి ఆమె మాట్లాడారు. రాబోయే ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకుని ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కేంద్రం మహిళా బిల్లును ప్రవేశ పెట్టిందని, బిల్లుపై బీజేపీ ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి లేదని ఆమె ఆరోపించారు. 1989లో ప్రధానిగా రాజీవ్ గాంధీ ఉన్నప్పుడే దేశంలో మొదటి సారి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును సభలో ప్రవేశ పెట్టగా, బీజేపీకి చెందిన అద్వానీ, వాజ్ పేయ్, యశ్వంత్ సింగ్, రామ్ జత్మలానీ వంటి నేతలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారని గుర్తు చేశారు. తదనంతరం 1992లో కాంగ్రెస్ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించారని పేర్కొన్నారు. పార్లమెంట్ కు సంబంధించి 2010లో అప్పటి కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ప్రవేశ పెట్టిన, 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు ముందుగా రాజ్యసభలో నెగ్గినా., పూర్తి స్థాయి జన గణన, జనభా లెక్కలు అందుబాటులో లేని కారణంగా లోక్ సభలో వీగిపోయిందని పంకూరి పథక్ వివరించారు.

ఈ నేపధ్యంలో 2016లో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, మార్చి 8వ తేదీన లోక్ సభలో మహిళా బిల్లును పాస్ చేయాలని సోనియా గాంధీ ప్రధని మోడీని కోరారన్నారు. 2017లో కూడా లోక్ సభలో మహిళా బిల్లును పాస్ చేయాలంటూ, ప్రధాని మోడీకి సోనియా గాంధీ ఒక లేఖ కూడా రాసినట్లు ఆమె పేర్కొన్నారు. తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉన్న బీజేపీ, మహిళా బిల్లును అమలు చేయడానికి పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు పట్టించుకోలేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి పంకూరి పథక్ స్పష్టం చేశారు. 2018లో రాహుల్ గాంధీ కూడా మహిళా బిల్లును పాస్ చేయాలంటూ స్వయంగా ప్రధాని మోడీకి వినతిపత్రం సమర్పించారని తెలిపారు.

2011-12 కాంగ్రెస్ హయాంలో జరిగిన జన గణన లెక్కల్ని కూడా ఇంత వరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బయట పెట్టలేదని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు బిల్లు పాస్ చేయడమే కాకుండా, 2029 వరకు అమలు ఉండదని చెప్పడం మహిళ పట్ల, రిజర్వేషన్ల పట్ల బీజేపీ చిత్తశుద్ధిని తెలియజేస్తుందని ఆమె పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం స్రుష్టించిన ఉన్నావో ఘటన, జమ్మూ, కాశ్మీర్ లో 8 సంవత్సరాల బాలికను మానభంగం చేసి హత్య చేయడంతో పాటు దేశంలో మహిళలపై జరిగిన మరెన్నో దాడులను బీజేపీలోని మహిళా పార్లమెంట్ సభ్యులు కూడా కనీసం ఖండించలేదని పంకూరి పథక్ తెలిపారు.

ఆధునిక యుగంలో జరిగిన మణిపూర్ నరమేధాన్ని సైతం బీజేపీ నాయకులు తప్పు పట్టక పోవడంతో పాటు మహిళలకు సంబంధించిన నేరాల్లో ఉన్న నిందితులకు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు కొమ్ము కాస్తున్నాయని ఆమె మండి పడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ లో పాస్ కావడం పట్ల కాంగ్రెస్ పార్టీ ఎంతో సంతోషంగా ఉందన్న ఆమె, కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న 2011 కుల గణన సమాచారంతో, 2024 ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్లు, అందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు కూడా వర్తింప చేయాలని బీజేపీని డిమాండ్ చేశారు. అదే విధంగా 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని కూడా ఎత్తి వేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు, రాష్ట్ర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు లాం తాంతియా కుమారి, రాష్ట్ర కార్యనిర్వహక అధ‌్యక్షురాలు సుంకర పద్మశ్రీతో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement