అమరావతి, ఆంధ్రప్రభ: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియపై ఉద్యోగ సంఘాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి.. నిబంధనల ప్రకారం ఐదేళ్ల కాలపరిమితి పైబడిన ఉద్యోగి లేదా అధికారిని బదిలీ చేయాలనే నిబంధనలు ఉన్నప్పటికీ సిఫార్సుల కారణంగా పలువురు నష్టపోతున్నారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.. ప్రభుత్వం విధించిన వారం రోజుల గడువు అవకతవకలకు ఆస్కారం ఇస్తోందని చెబుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వం జారీచేసిన బదిలీ ఉత్తర్వులు లోపభూయిష్టంగా ఉన్నాయనే వాదనలు వినవస్తున్నాయి. ఒకే చోట ఐదేళ్లు పూర్తిచేసిన ఉద్యోగిని విధిగా బదిలీ చేయాలనే నిర్దేశించినా కటాఫ్ తేదీని నిర్దేశించక పోవటం వల్ల ఇష్టారాజ్యంగా ప్రక్రియ కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏపీజీఈఏ) ఆరోపిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు ఒకటో తేదీ నాటికి ఐదేళ్ల పూర్తిచేసుకున్న వారిని బదిలీ చేసే విధంగా కటాఫ్ తేదీని నిర్ణయించాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వ బదిలీ మార్గదర్శకాల్లో లోపాలు ఉన్నందున వాటిని సవరించి మరో జీవోను విడుదల చేయాలని అసోసియేషన్ అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి జి ఆస్కారరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బదిలీల ప్రక్రియకు సంబంధించి వివిధ శాఖల్లో జరుగుతున్న తీరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శికి వివరిస్తూ లేఖలు రాశారు. మరోవైపు బదిలీల నిబంధనల్లో గందరగోళం కారణంగా సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఉన్నతాధికారులు ప్రభుత్వంతో సంప్రతింపులు జరుపుతున్నారు.
జనాభా నిష్పత్తితో సంబంధంలేని వివిధ ప్రభుత్వ శాఖల్లో కార్యాలయాలు ఎక్కువగా జిల్లా కేంద్రాల్లోనే ఉంటాయి. అలాంటప్పుడు ఐదేళ్లు పూర్తయిన వారిని బదిలీ చేయాలంటే అంతే సంఖ్యలో మరో ప్రాంతంలో పోస్టింగ్‌లు అందుబాటులో ఉండవు. ఈ కారణంగా స్టేట్ ఆడిట్ డిపార్టుమెంట్ విషయంలో స్టేషన్ అంటే ఆఫీస్ అని ప్రభుత్వం నిర్వచించింది. ఇదే ఫార్ములాను అదే రీతిలో ఉన్న వివిధ ప్రభుత్వ శాఖలకు కూడా అన్వయించాలని ఏపీజీఈఏ డిమాండ్ చేసింది. ప్రభుత్వ జీవోలో ఇటీవల నిర్వహించిన జిల్లాల పునర్విభజన సందర్భంగా ఆర్డర్ టు సర్వ్ పేరిట ఉద్యోగులను ఈ బదిలీల నుండి మినహాయించడం చట్టవిరుద్ధం, రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకమవుతుందని ఏపీజీఈఏ నేతలు వాదిస్తున్నారు. అందువల్ల జిాల పునర్విభజన సందర్భంగా ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపునకు ఈ ఏడాది ఫిబ్రవరి 22వ తేదీన జారీచేసిన జీవో 31లో ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం తాత్కాలిక కేటాయింపు చేసిన ఉద్యోగులు అందరికీ సీనియారిటీ, పదోన్నతి, ఇతర సర్వీసు వ్యవహారాలకు సంబంధించి ఉమ్మడి జిల్లానే ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టంగా వివరిస్తూనే ఇప్పుడు వారిని బదిలీ నుంచి మినహాయించడం ఆర్టికల్ 371 (డీ)కి విరుద్ధమని ఉద్యోగ నేతలు స్పష్టం చేస్తున్నారు.
బదిలీల్లో జరిగే అవకతవకలు, మార్గదర్శకాలకు భిన్నంగా ఉద్యోగి బదిలీ అయితే పై అధికారికి అప్పీలు చేసుకునే నిబంధన పొందుపరచాలని సూచించింది. ఎవరైనా ఉద్యోగి బదిలీకి అప్పీల్ చేసుకున్నప్పుడు 7 లేదా 10 పనిదినాల్లో అప్పిలేట్ అథారిటీ నిర్ణయాన్ని వెలువరించాల్సి ఉంది. ఆ తరువాతే ఉద్యోగి బదిలీకి సంబంధించి ట్రాన్సఫరింగ్ అథారిటీ నిర్థారించాల్సి ఉందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2020లో ఇచ్చిన వివరణ ప్రకారం గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నాయకులకు ఆరేళ్లు రాయితీ కల్పించాలని డిమాండ్ చేశారు. ఆరేళ్లు దాటితే ఏ శాఖలో అయినా, ఏ అధికారి అయినా బదిలీ విషయంలో అక్రమాలకు పాల్పడితే సంబంధిత అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేలా బదిలీల మార్గదర్శకాల్లో చేర్చాలని ఏపీజీఈఏ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుత బదిలీల్లో వైద్యారోగ్యశాఖలో ఎంపీహెచ్‌ఏ, ఏఎన్‌ఎంలకు కూడా అవకాశమివ్వాలని కోరుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.