అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో 13 నైపుణ్యాభివృద్ధి భవన నిర్మాణాలకు బుధవారం శంకుస్థాపన చేశారు. గాజువాక ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ఏర్పాటు చేసిన నైపుణ్యాభివృధ్ధి భవనానికి రాజ్యసభ సభ్యులు సురేష్ ప్రభు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంలో ఈ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పనితీరు చాలా బావుందని, యువతకు ఎటువంటి స్కిల్స్ పై శిక్షణ ఇవ్వాలనే దానిపై ఆయన పలు సూచనలు చేశారు. విశాఖపట్నం జిల్లా నుండి మిగిలిన 12 జిల్లాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ భవనాలను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ సత్యనారాయణ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సురేష్ ప్రభు తన ఎంపి లాడ్స్ నుండి జిల్లాలోని నైపుణ్యాభివృధ్ధి భవనాలకు రూ. 9కోట్ల 10 లక్షల రూపాయలు మంజూరు చేశారన్నారు.
ఈ నిధులతో ప్రతి జిల్లాలో 40 లక్షలు భవన నిర్మాణానికి 30 లక్షలు పరికరాల కొనుగోలుకు కేటాయించడం జరిగిందన్నారు. సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా స్థానిక యువతకు 75 శాతం ఉద్యోగావకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. యువతకు ఉద్యోగ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వడానికి ఈ స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. పరిశ్రమలకు అనువైన శిక్షణా కార్యక్రమాలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా పొందవచ్చని సూచించారు. రాబోయే రోజుల్లో 175 నియోజక వర్గాల్లో వచ్చే స్కిల్ హబ్స్, కాలేజెస్, స్కిల్ సెంటర్స్ కు అనుబంధంగా పనిచేస్తాయన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, ఎమ్మెల్సీలు మాధవ, వరుదు కల్యాణి,రఘువర్మ, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ రామ కోటి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..