Tuesday, January 7, 2025

AP | పర్యాటక రంగంలో పెట్టుబడిదారులకు రాయితీలు!

రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక శాఖ మంత్రి దుర్గేష్‌

ఏపీలో పర్యాటక, సినీ రంగంలో పెట్టుబడులకు విస్తారమైన అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌ తెలిపారు. పర్యాటక అభివృద్ధిలో భాగంగా పీపీపీ విధానంలో ముందుకు వెళ్తున్నామని పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

హైదరాబాద్‌ హైటెక్స్‌లో జరుగుతున్న అమెరికన్‌ ప్రోగ్రెసివ్‌ తెలుగు అసోసియేషన్‌ కేటలిస్ట్‌ గ్లోబల్‌ బిజినెస్‌ కాన్ఫరెన్స్‌లో మంత్రి కందుల దుర్గేష్‌ పాల్గొని ప్రసంగించారు. ఏపీ నూతన టూరిజం పాలసీ 2024-29 వివరాలను ఆయన వెల్లడించారు. ఏపీలో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులకు కూటమి ప్రభుత్వం ప్రోత్సాహం, రాయితీలు అందిస్తుందని వెల్లడించారు.

సరైన ప్రతిపాదనలతో వస్తే స్పందించి అవకాశం కల్పిస్తామన్నారు. పర్యాటక, చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కావలసిన మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలను వివరించారు. నూతన టూరిజం పాలసీ 2024-29 విధి విధానాలు, నూతన ఆవిష్కరణలను పారిశ్రామికవేత్తలకు మంత్రి వివరించారు.

గతేడాది సెప్టెంబర్‌ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పర్యాటక రంగానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశ్రమ హోదా కల్పించారని, ఇది పర్యాటక రంగ వృద్ధికి శుభ పరిణామం అని పేర్కొన్నారు. ఏపీ ఆర్థిక పురోభివృద్ధి సాధించేలా, ఉపాధి అవకాశాలు కల్పించేలా, సాంస్కృతిక వైభవాన్ని కొనసాగించేలా పాలసీ రూపొందించామని వెల్లడించారు.

- Advertisement -

కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రసాద్‌, స్వదేశీ దర్శన్‌-2, శాస్కి పథకాల ద్వారా పర్యాటక అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. సినిమా రంగంలో పెట్టు-బడులకు విస్తృత అవకాశాలున్నాయని, ఏపీలో స్టూడియోలు, డబ్బింగ్‌ థియేటర్లు, రీ రికార్డింగ్‌ థియేటర్‌లు తదితర మౌలిక వసతుల కల్పనకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement