ఏపీఎస్ ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు రాయితీ ప్రయాణ టిక్కెట్లు జారీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఆర్టీసీ అధికారులు విడుదల చేశారు. 60 ఏళ్లు పైబడిన ప్రతి సీనియర్ సిటిజన్‌కు ప్రాంతాలు, రాష్ట్రాలతో సంబంధం లేకుండా దేశంలోని ఏ రాష్ట్రానికి చెందినవారైనా… ప్రయాణ ఛార్జీలపై 25 శాతం రాయితీని ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
టికెట్లు జారీ చేసే సమయంలో వయసు నిర్ధరణ కోసం సీనియర్ సిటిజన్లు తమ ఆధార్ కార్డు లేదా సీనియర్ సిటిజన్ ఐడీ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, పాస్ పోర్ట్, రేషన్ కార్డుల్లో ఏదో ఒకటి చూపించి రాయితీ పొందవచ్చని తెలిపింది. ఈ మేరకు అన్ని జిల్లాల డీపీటీవో, ఈడీలకు ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ అప్పలరాజు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.