అమరావతి వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, అమరావతే రాజధానిగా ఉండాలని ప్రార్థించానని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇవాళ తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల కోరిక అమరావతి అని పునరుద్ఘటించారు. గత 45 రోజులుగా అలుపు సొలుపు లేకుండా అమరావతి ఏకైక రాజధాని కోసం వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి తిరుపతి చేరుకున్న రైతులకు మద్దతిచ్చేందుకే తాను తిరుపతికి వచ్చిన్నట్లు వెల్లడించారు.
అమరావతి మహోద్యమ సభకు తాను హాజరవుతున్నానని ప్రకటించారు. రాజధాని మూడుప్రాంతాల్లో పెడతామని మాయమాటలు చెబితే రాష్ట్రం నష్టపోతుందన్నారు. అయితే న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో రైతుల మహాపాదయాత్ర తుళ్లూరు నుంచి అలిపిరి వరకు కొనసాగగా మహాపాదయాత్ర ముగింపుగా అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఈరోజు తిరుపతిలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు వైసీపీ మినహా అన్ని పార్టీలకు ఆహ్వానం పంపారు. మరోవైపు సభకు వచ్చే టీడీపీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు పలుచోట్ల అడ్డుకున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital