Friday, November 22, 2024

Tirupati: ఘాట్ రోడ్ భద్రతకు సమగ్ర ప్రణాళిక : టిటిడి ఈఓ ధర్మారెడ్డి 

తిరుపతి (రాయలసీమ ప్రభ వెబ్ న్యూస్ ) : తిరుపతి – తిరుమల ఘాట్ రోడ్లపై జరిగే ప్రమాదాలను నివారించడానికి తమ నిఘా భద్రతా విభాగం, పోలీసు శాఖా సమన్వయంతో పటిష్టమైన సమగ్ర  ప్రణాళికను రూపొందించాలని టి టి డి కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి నిర్దేశించారు. ఈరోజు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని టీటీడీ ఈవో ఛాంబర్‌లో ఆయన ఘాట్‌రోడ్డు ప్రమాదాల నివారణ, ముందస్తు చర్యలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం లో ధర్మారెడ్డి మాట్లాడుతూ… తిరుపతి – తిరుమల ఘాట్‌రోడ్లలో భద్రతను పటిష్టం చేసేందుకు పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఈ విషయంలో టీటీడీ సీవీఎస్‌వో, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కలిసి ఉత్తమ ప్రతిపాదనలు రూపొందించాలని కోరారు. ఇతర ముఖ్యమైన చర్యల్లో భాగంగా ఘాట్‌ రోడ్లపై ప్రమాదం జరిగినప్పుడల్లా, ఆ కేసును వెంటనే స్విమ్స్ , బర్డ్ లకు రిఫర్ చేయడమే కాక సంబంధిత ఆసుపత్రికి సమాచారం తెలియచేసి ఆ ఆసుపత్రుల్లో ఎటువంటి ఆలస్యం లేకుండా క్షతగాత్రులకు చికిత్స చేయించడానికి ఒక యాక్షన్ టీమ్ సిద్ధంగా ఉండాలన్నారు.

అందులో భాగంగా తిరుమలలో వైకుంఠం నుండి టెంపుల్ పాయింట్ వరకు ఉన్న దారితో పాటు రెండు ఘాట్ రోడ్లు, రెండు ఫుట్‌పాత్ మార్గాలకు సంబందించిన నాలుగు ఎంట్రీ పాయింట్ల వద్ద 100% నిఘా ఉండేలా చేయాలన్నారు. తిరుపతిలో వాహనాల డ్రైవర్లకు ప్రత్యామ్నాయ సౌకర్యాలను అందించే అవకాశాలను, తిరుమలలో ప్రీ-పెయిడ్ టాక్సీ వ్యవస్థలను అమలు చేయడానికి స్థలాలను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఘాట్‌ రోడ్లపై తరచుగా ప్రమాదాలకు గురయ్యే వాహనాల రాకపోకలను నిషేధించడంతో పాటు ఘాట్‌లపై నిఘా కోసం టీటీడీ సెక్యూరిటీ పోస్టులను ఏర్పాటు చేయాలన్నారు.

రెండు ఘాట్‌ రోడ్లలో వాహనాల కార్యకలాపాలు ప్రారంభమయ్యే సమయంలో, రవాణా సజావుగా ఉండేలా ఆ సమయంలో ఆర్టీసీ తరపున సూపర్‌వైజర్ అందుబాటులో ఉండేలా చూడాలని, రోడ్డు భద్రత చర్యల్లో భాగంగా రెండు బస్సుల మధ్య సరైన దూరం ఉండేలా డ్రైవర్లకు మార్గనిర్దేశం చేయాలని ధర్మారెడ్డి సూచించారు. అవ్వాచారి కోన మొదలైన ప్రమాదకరమైన ప్రదేశాలలో రోలర్-కోస్టర్ వంటి వేగ నిరోధకాలను అడ్డంకుల వంటివి ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో టి టి డి జె ఈ ఓ వీరబ్రహ్మం, ముఖ్య నిఘా భద్రతాధికారి నరసింహ కిశోర్, చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు, ట్రాన్స్‌పోర్ట్ జీ ఎం శేషారెడ్డి, అటవీ అధికారి  శ్రీనివాసులు, ఎస్టేట్స్ స్పెషల్ ఆఫీసర్ మల్లిఖార్జున, ఎస్ పీ సి హెచ్ సి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, బర్డ్ఇన్‌ఛార్జ్ డాక్టర్ కిషోర్, స్విమ్స్ ప్రతినిధి  డాక్టర్ రామ్, జిల్లా వైద్య్ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరి, జిల్లా రవాణా శాఖాధికారి సీతారామి రెడ్డి, జిల్లా ప్రజా రవాణా అధికారి జితేందర్‌నాథ్ రెడ్డి, తిరుమల అదనపు ఎస్ పీ మునిరామయ్య, తిరుమల ట్రాఫిక్ డీఎస్పీ కొండయ్య, వీజీవో మనోహర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement