Saturday, November 23, 2024

పూర్తైన డ్రోన్‌ సర్వే… 337 గ్రామాలలో 13నెంబర్‌ నోటిఫికేషన్‌

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే శరవేగంగా సాగుతోంది. మునుపెన్నడూ జరగని ప్రక్రియ నేపధ్యంలో బాలారిష్టాలు ఎదురవుతున్నప్పటికీ అధికారుల సమన్వయంతో ఈ ప్రాజెక్టు ముందుకు దూసుకు వెళుతోంది. సర్వే ఆఫ్‌ ఇండియాతో పాటు ఇతర ప్రవేటు ఏజెన్సీలను సైతం రంగంలోకి దింపటంతో పరిస్ధితిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1324 రెవిన్యూ గ్రామాలలో డ్రోన్‌ సర్వే పూర్తి కాగా, 337 గ్రామాలలో అధికారికంగా 13వ నెంబర్‌ నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యవసాయ భూముల, పట్టణ, గ్రామీణ నివాస స్ధలాల రీసర్వే అత్యున్నత సాంకేతిక విధానాల ఆలంబనగా ముందడుగు వేస్తోంది. దేశంలోనే మరెక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మానస పుత్రికగా అమలవుతున్న రీసర్వే ప్రాజెక్టును నిర్ణయించిన గడువులోపే పూర్తి చేసే క్రమంలో నూతన కార్యాచరణ సిద్దం చేసారు. కేవలం సర్వే ఆఫ్‌ ఇండియాపైనే అధారపడటం వల్ల డ్రోన్ల లభ్యతలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించే క్రమంలో జిల్లాల వారిగా ఇప్పటికే టెండర్లను పిలిచారు.

రీసర్వేలో అత్యంతక కీలకమైన డ్రోన్‌ సర్వే మొదలు ఎల్‌పీఎం తయారీ వరకు జరిగే అన్ని ప్రక్రియలు తాజాగా పిలిచిన టెండర్‌ ప్రక్రియలో అంతర్భాగంగా ఉన్నాయి. ఇప్పటికే సర్వే ఆఫ్‌ ఇండియాకు కేటాయించిన జిల్లాలు మినహాయించి మిగిలిన జిల్లాలలో ఎల్‌1 బిడ్డర్‌ గా నిలిచిన సంస్ధలు పనులను వేగవంతం చేసాయి. విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాలలో టెండర్‌ దక్కించుకున్న సంస్ధ డ్రోన్‌ ప్లయింగ్‌ మొదలు ఇతర పనులను పరుగులు పెట్టిస్తోంది. మిగిలిన జిల్లాలలో సైతం టెండర్లు పిలవగా, అవి టెక్నికల్‌ ఎవల్సూషన్‌ దశలో ఉన్నాయి. మరోవైపు సర్వే ఆఫ్‌ ఇండియాకు నిర్ధేశించిన ప్రాంతాలలో రీ సర్వే కోసం ఆసంస్ధ కూడా టెండర్లు పిలిచింది. ఈ ప్రక్రియ ఏప్రిల్‌ నాటికి పూర్తికానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement