Friday, November 22, 2024

ప్రాజెక్టులు పూర్తి చేయండి, నిధులు కేటాయించండి.. విభజన హామీల అమలుకు వైసీపీ డిమాండ్

ఏపీలో భారత్ మాల, సాగర్ మాల ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలి.. రోడ్లు, రైల్వే లైన్లు వంటి మౌలిక వసతుల ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలి.. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు పూర్తైనా హామీలు మాత్రం అమలవడం లేదు. పోలవరం ప్రాజెక్టుకు పునరావాసం, పరిహారం సహా నిధులు పూర్తిగా కేటాయించాలి అని బడ్జెట్​ సమావేశాల సందర్భంగా కేంద్రాన్ని వైసీపీ కోరుతోంది..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీల అమలుకు బడ్జెట్‌లో పూర్తి కేటాయింపులు కోరతామని  వైఎస్సార్సీపీ స్పష్టం చేసింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సోమవారం న్యూఢిల్లీలో రాజమండ్రి వైసీపీ ఎంపీ, చీఫ్ విప్ మార్గాని భరత్ మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు పూర్తైనా హామీలు మాత్రం అమలవడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు పునరావాసం, పరిహారం సహా నిధులు పూర్తిగా కేటాయించాలనే అంశంపై ఇటీవల జరిగిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలత వ్యక్తమైందని తెలిపారు. గుజరాత్ తర్వాత సువిశాలమైన తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, పశ్చిమ తీరంలో ముంబై తరహాలో విశాఖ నగరాన్ని అభివృద్ధి చేయవచ్చని భరత్ అభిప్రాయపడ్డారు. ఏపీలో భారత్ మాల, సాగర్ మాల ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రోడ్లు, రైల్వే లైన్లు వంటి మౌలిక వసతుల ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కోరారు.

సూర్యాపేట – విశాఖపట్నం రహదారితో 100 కి.మీ దూరం తగ్గి ప్రయాణ సమయం తగ్గుతుందని, ఈ ప్రాజెక్టుకు తగిన నిధులు కేటాయించి వేగంగా ప్రాజెక్టును పూర్తి చేయాలని, కొవ్వూరు – భద్రాచలం రైల్వే లైనుకు ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని, రాష్ట్రానికి అవసరమైన నిధులు సాధిస్తూనే ఉన్నామని తెలిపారు. వైసీపీ కేంద్రంపై సరైన రీతిలో పోరాటం చేయట్లేదనే విమర్శల మీదా ఎంపీ భరత్ స్పందించారు. చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకుని హోదాను వద్దనడం వల్లే రాష్ట్రం ఇప్పటికీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆరోపించారు. చంద్రబాబు యూటర్న్ తీసుకుని ఉండకపోతే పరిస్థితి మరోలా ఉండేదని అభిప్రాయపడ్డారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపుల్లో సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న అభిప్రాయం అందరిలో ఉందనీ భరత్ చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement