(ప్రభ న్యూస్, ఎన్టీఆర్ బ్యూరో) : ఎన్టీఆర్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాద్ విజ్ఞప్తి చేశారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని ముత్యాల, వేదాద్రి, పోలంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్లు అభివృద్ధికి నిధులు మంజూరు చేసి, ఈ ప్రాంత రైతుల సాగునీటి అవసరాలు తీర్చాలని ఎంపి కేశినేని శివనాథ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును కోరారు.
ఈ మేరకు జగ్గయ్యపేటకు విచ్చేసి ముత్యాల, వేదాద్రి, పోలంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్లు పరిశీలించాల్సిందిగా మంత్రి నిమ్మల రామానాయుడును ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య తో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ ఆహ్వనించారు.
జగ్గయ్యపేట నియోజకవర్గంలో అన్నదాతలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించాలని ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు ను మంగళవారం విజయవాడలో మినిస్టర్ కార్యాలయంలో ఎంపి కేశినేని శివనాథ్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య తో కలిసి కలిశారు.
జగ్గయ్యపేట నియోజకవర్గంలోని మున్నేరు పోలంపల్లి డ్యామ్ అభివృద్ధికి సంబంధించి, వేదాద్రి ఎత్తుపోతల పథకం పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చేందుకు అవసరమైన నిధులు విషయమై మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే కంచల,వేదాద్రి స్కీమును అభివృద్ధి చేసి పునః ప్రారంభించుకోవాలని భావిస్తున్నట్లు వివరించారు.
పోలంపల్లి ఆయకట్టుకు శాశ్వతంగా సాగునీరు అందించేలా ప్రయత్నిస్తున్నట్లు తెలియజేశారు. జగ్గయ్య పేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రక్షిత తాగునీరు అందించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు ఎంపి కేశినేని శివనాథ్ మంత్రికి వివరించారు. జిల్లాలోని సాగు తాగునీరు ప్రాజెక్టుల వివరాలను సమగ్రంగా ఆయనకు వివరించారు.