అమరావతి, ఆంధ్రప్రభ : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రయాణికులను ఆకర్షించేందుకు రెండు రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లు పోటీ పడుతున్నాయి. ప్రయాణికులకు సౌకర్యాల కల్పన..టిక్కెట్లపై రాయితీలు ప్రకటిస్తూ ఓఆర్(ఆక్యుపెన్సీ రేషియో) పెంచుకునేందుకు చర్యలు చేపట్టాయి. పోటీ తత్వంతో పలు రాయితీలు, సౌకర్యాల కల్పన పట్ల ప్రయాణికులకు ఊరట దక్కుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఆర్టీసీ కూడా విడిపోయింది. గతంలోని ఏపీఎస్ ఆర్టీసీ ఏపీకి రాగా..కొత్తగా ఏర్పడిన తెలంగాణకు టీఎస్ ఆర్టీసీని ఏర్పాటు చేశారు. ఇదే క్రమంలో బస్సులు, సిబ్బంది కూడా వేర్వేరుగా ఆయా సంస్థలకు కేటాయించారు. అప్పటి నుంచి ఓఆర్ పెంచుకునే ప్రయత్నాల్లో రెండు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు ఉన్నాయి. కాగా ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వమే ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లిస్తోంది. ఇదిలా ఉండగా కోవిడ్-19 నేపధ్యంలో కొంత కాలం పాటు రెండు రాష్ట్రాల ఆర్టీసీ సర్వీసులు నిలిచిపోయాయి. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేధ్యంలో కిలో మీటర్లు, బస్సు సర్వీసులను రెండు రాష్ట్రాల ఆర్టీసీలు స్థిరీకరించాయి. తెలంగాణ భూభాగంలో లక్షా ఐదు వేల కిలో మీటర్ల మేర 560 బస్సులు ఏపీఎస్ ఆర్టీసీ నడుపుతోంది. ఇదే కిలో మీటర్ల పరిధిలో ఏపీ భూభాగంలో టీఎస్ ఆర్టీసీ బస్సులు 750 పైచిలుకు నడుపుతున్నారు. రెండు రాష్ట్రాల్లో కిలో మీటర్ల పెంపుకు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు పలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ రకరకాల కారణాలతో వాయిదా పడుతోంది. ఈ క్రమంలోనే ఇటు ఏపీఎస్ ఆర్టీసీ, అటు టీఎస్ ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్య పెంపుకు పలు కొత్త ఆఫర్లలో ముందుకొస్తున్నాయి. మరో వైపు కొత్త బస్సులతో ప్రయాణికులను ఆకర్షించేందుకు చర్యలు చేపడుతున్నాయి.
ఆఫర్ల వెల్లువ..
ప్రభుత్వంలో ఉద్యోగులు విలీనమైన తర్వాత పలు ఆఫర్లను ఏపీఎస్ ఆర్టీసీ ప్రకటిస్తోంది. ముందస్తు ఆన్లైన్ బుకింగ్ చేసుకునే ప్రయాణికులకు ఏసీ బస్సుల్లో తిరుగు ప్రయాణంపై 10శాతం, నలుగురు సభ్యుల గ్రూపు బుకింగ్‌పై మరో 10శాతం అదనంగా ఇస్తున్నారు. దసరా, సంక్రాంతి వంటి పర్వదినాల్లో అదనపు చార్జీలు లేకుండానే సాధారణ చార్జీలపై ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఓ వైపు ఆఫర్లు ప్రకటిస్తూనే ఇంకో వైపు పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక సర్వీసులను నడపడం ద్వారా ప్రయాణికుల సంఖ్య పెంచుకునేందుకు ఏపీఎస్ ఆర్టీసీ పలు చర్యలు చేపట్టింది. ఏపీఎస్ ఆర్టీసీకి తీసిపోని రీతిలో టీఎస్ ఆర్టీసీ కూడా ఆఫర్లు ప్రకటిస్తోంది. గత సంక్రాంతి సమయంలో అదనపు ఛార్జీలు వసూలు చేయకుండానే ప్రత్యేక సర్వీసులు నడిపింది. కొద్ది రోజుల కిందట హైదరాబాద్ సబర్బన్ ప్రాంతంలో తిరిగే ప్రయాణికులకు రెండు ఆకర్షణీయమైన పథకాలను టీఎస్ ఆర్టీసీ ప్రకటించింది.
టీ6 పేరిట ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటల మధ్య మహిళలు, వృద్ధులకు రూ.50కే విస్తృత ప్రయాణ సౌకర్యం కలిపిస్తోంది. మరో వైపు ఎఫ్24 పేరిట వారాంతపు రోజులు, సెలవు రోజుల్లో నలుగురు కుటుంబ సభ్యులు రూ.300కే 24గంటల పాటు ప్రయాణించేందుకు అవకాశం కలిపిస్తోంది. సాధారణ రోజుల్లో ఒక్క ప్రయాణికునికే 24గంటల పాటు తిరిగేందుకు రూ.400 వసూలు చేస్తుండగా..సెలవు రోజుల్లో రూ.300 కుటుంబం మొత్తానికే అవకాశం కలిపించడం ప్రయాణికులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇదిలా ఉండగా రెండు ఆర్టీసీ సంస్థలు అధికారిక వెబ్సైట్ల ద్వారా ముందస్తు బుకింగ్‌లపై పలు రాయితీలు కలిపిస్తున్నాయి.
కొత్త బస్సులు..
కొత్త బస్సుల కొనుగోలుపై డోలాయమానంలో ఉన్న ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు టీఎస్ ఆర్టీసీ నుంచి కొత్త బస్సుల రాకతో మనస్సు మార్చుకున్నారు. ఇటీవల టీఎస్ ఆర్టీసీ సూపర్ లక్జరీ, నాన్ ఏసీ స్లీపర్ సహా పలు రకాల కొత్త బస్సులను ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు నాన్ ఏసీ స్లీపర్ఒ బస్సులతో సరిపెట్టిన ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు..కొత్త బస్సుల కొనుగోలుపై ఆలోచనలోనే ఉన్నారు. విద్యుత్ బస్సులా? డీజిల్ బస్సులా? అనే మీమాంసలో ఉన్న నేపధ్యంలో టీఎస్ ఆర్టీసీ కొత్త బస్సులు దించడంతో ప్రభుత్వాన్ని ఒప్పించి కొత్త బస్సుల కొనుగోలుకు సిద్ధమవుతున్నారు.
ఇటీవలనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి 2,736 కొత్త బస్సులకు అనుమతించినట్లు ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఇందులో డీజిల్, విద్యుత్ బస్సులతో పాటు అద్దె బస్సులు కూడా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. సమయ పాలన, ప్రయాణికుల సౌకర్యాల కల్పనలో కూడా రెండు రాష్ట్రాల ఆర్టీసీలు పోటీ పడుతున్నాయి. పోటీ తత్వంతో టిక్కెట్లపై పలు రాయితీలు, సౌకర్యాల కల్పన పట్ల ప్రయాణికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.