నెల్లూరు (ప్రభ న్యూస్) : త్వరలోనే మన్నారు పోలూరు, రాచర్ల మీదుగా నూతనంగా వేయనున్న డబల్ సర్క్యూట్ విద్యుత్ లైన్ వెళ్లే భూములకు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన నష్ట పరిహారం విషయమై నిర్ణయం తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయంలో తిరుపతి ట్రాన్స్‌కో, రెవెన్యూ అధికారులతో భూముల నష్టపరిహారం పై సమావేశం నిర్వహించారు. సూళ్లూరుపేట నియోజకవర్గం పరిధిలోని మన్నారుపోలూరు 220 కేవీ సబ్ స్టేషన్ నుంచి చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండల పరిధిలోని రాచర్ల సబ్ స్టేషన్ వరకు రైతుల భూముల మీదుగా వేయనున్న డబుల్ సర్క్యూట్ విద్యుత్ లైన్ కు సంబంధించి నష్టపరిహారంపై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా విద్యుత్ లైన్ వెళ్లే మార్గంలోని వెందులూరుపాడు, కాదలూరు గ్రామాల రైతులు తమకు చిత్తూరు జిల్లాలో రైతులకు చెల్లించిన విధంగా నష్ట పరిహారం చెల్లించాలని కలెక్టర్ కు విన్నవించారు. ఈ విషయమై స్పందించిన కలెక్టర్ అన్నీ పరిశీలించి త్వరలోనే నష్ట పరిహారం విషయమై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ హరేందిర ప్రసాద్, నాయుడుపేట ఆర్డీవో సరోజినీ, తిరుపతి ట్రాన్స్‌కో ఎస్‌ఈ ప్రతాప్ కుమార్, ఈఈ బిందు, డీఈ రామకృష్ణ, అసిస్టెంట్ ఏఈ నాగేష్, కలెక్టరేట్ తహసీల్దార్ శాంతకుమారి, తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily