అమరావతి, ఆంధ్రప్రభ: పట్టా భూములతో సమానంగా అసైన్డ్ భూములకు పరిహారం చెల్లించాల్సిందే అని హైకోర్టు తీర్పునిచ్చింది. ప్రజోపయోగ కార్యక్రమాల నిమిత్తం సేకరించినా తగిన పరిహారం ఇవ్వాలంది. 2013 భూసేకరణ చట్టం, రాష్ట్రంలో అమల్లో ఉన్న ఇతర చట్టాల కింద అసైన్డ్ దారులు పరిహారం పొందేందుకు అర్హులని స్పష్టం చేసింది. ఇండస్ట్రియల్ పార్కు నిమిత్తం చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం మంగళం గ్రామానికి చెందిన తమకు కేటాయించిన అసైన్డ్ భూములను ఎలాంటి పరిహారం చెల్లించకుండా అధికారులు స్వాధీనం చేసుకున్నారని పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ 2018లో గ్రామానికి చెందిన పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అప్పట్లో విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం భూ సేకరణ ప్రొసీడింగ్స్‌ను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది
. ఈ వ్యాజ్యంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి తుది విచారణ జరిపారు. పిటిషనర్ల తరుపు న్యాయవాది కాలవ సురేష్ వాదనలు వినిపించారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పిటిషనర్లు పరిహారానికి అర్హులని కోర్టు దృష్టికి తెచ్చారు. అసైన్డ్ భూమి కనుక ప్రజోపయోగానికి సేకరించామని దానికి పరిహారం చెల్లించాల్సిన అవసరంలేదని అధికారులు చెప్తున్నారని 2016లో ప్రభుత్వం జారీచేసిన జీవో 259 ప్రకారం అసైన్డ్ భూమికి పట్టా భూమితో సమానంగా నష్టపరిహారం చెల్లించాల్సి ఉందన్నారు. ఇదే వ్యవహారానికి సంబంధించి ఓ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించిందని ప్రభుత్వ సహాయ న్యాయవాది కోర్టుకు వివరించారు. ప్రస్తుతం ఈ వ్యవహారంలో స్టే అమల్లో ఉన్నందున ఎత్తివేసేంత వరకు జీవో 259 వర్తింప చేయకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదన్నారు. ఈ వాదనతో న్యాయమూర్తి విబేధిస్తూ గతంలో అసైన్డ్ భూమిని సేకరించినప్పుడు అనుభవదార్లకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియో చెల్లించలేదని పరిహారం చెల్లించేందుకు వీలుగానే 259 జీవోను అమల్లోకి తెచ్చిందని గుర్తుచేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..