జగన్ సర్కార్ పై పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని టీడీపీ, జనసేన జేఏసీ కమిటీ నిర్ణయం తీసుకుంది. గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు రెండు పార్టీలు కలిసి పనిచేయాలని గురువారం విజయవాడలో జరిగిన భేటీలో నిర్ణయించాయి. సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను రెండు పార్టీల నేతలు మీడియాకు వివరించారు. టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్ మీడియాతో పలు విషయాలను తెలిపారు. ఈ నెల 17వ తేదీ నుంచి టీడీపీ, జనసేన పార్టీలు సంయుక్తంగా భవిష్యత్తుకు గ్యారెంటీ స్కీమ్ లో పాల్గొనాలని డిసైడ్ చేశారు. రెండు పార్టీలు సంయుక్తంగా మేనిఫెస్టోను రూపొందించాలని నిర్ణయించారు. మరోవైపు రాష్ట్రంలో కరువు పరిస్థితులపై కూడా ఈ సమావేశంలో తీర్మానం చేశారు.
మూడు రోజులపాటు ఆత్మీయ సమావేశాలు..
ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు రోజుల పాటు టీడీపీ, జనసేన ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయం తీసుకున్నట్టు అచ్చెన్నాయుడు తెలిపారు. నియోజకవర్గాల వారీగా ప్రణాళికల తయారీకి నిర్ణయం తీసుకున్నామన్నారు. ఏ నియోజకవర్గంలో ఎప్పుడు ఏ కార్యక్రమం నిర్వహించే విషయమై రెండు రోజుల్లో తమ ప్లాన్ ను విడుదల చేస్తామని చెప్పారు.
మేనిఫెస్టో కోసం కమిటీ..
మేనిఫెస్టో కమిటీలో టీడీపీ తరపున యనమల రామకృష్ణుడుతో పాటు మరో ఇద్దరు సభ్యులుంటారని అచ్చెన్నాయుడు తెలిపారు. మేనిఫెస్టోపై ఈ నెల 13న మరోసారి సమావేశం ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. మేనిఫెస్టోలో జనసేన ఇచ్చిన నాలుగైదు అంశాలను కూడా చేర్చే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న కరువుపై ఉమ్మడి కార్యాచరణను అమలు చేయాలన్నారు. రైతులకు ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవరకూ పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నామని జనసేన నేత నాదెండ్ల మనోహర్ చెప్పారు. రోడ్లు, మద్యం, విద్యుత్ చార్జీల పెంపు, ఇసుక అక్రమాలపై పోరాటాలు చేస్తామన్నారు.
15 రోజులకోసారి సమస్యలపై ఉద్యమం..
ప్రతి 15 రోజులకు ఒక సమస్యపై ఉద్యమం చేయాలని ఇరు పార్టీలు నిర్ణయం తీసుకోనున్నట్టు నాదేండ్ల మనోహర్ చెప్పారు. బీసీలపై దాడులకు నిరసనగా కార్యక్రమాలు నిర్వహిస్తామని రెండు పార్టీల నేతలు అన్నారు. ఓటర్ జాబితాలో అక్రమాలపై కలిసి పనిచేయాలని నిర్ణయించారు. టీడీపీ-జనసేన నాయకులపై పెట్టిన కేసులపై న్యాయపరంగా పోరాటాలు చేస్తామని తెలిపారు.