Saturday, November 23, 2024

వైసీపీ పాలనపై పక్క రాష్ట్రాల కామెంట్లు.. సంక్షేమానికి తక్కువ-అప్పులు చేసేది ఎక్కువ: కనకమేడల

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ పరిణామాలు తెలుగు రాష్ట్రాల పరువు తీసే విధంగా ఉన్నాయని, వైస్సార్సీపీ పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో పక్క రాష్ట్రాల నుంచి వినాల్సి వస్తోందని టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ఢిల్లీలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. వైసీపీ నేతలు అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రే సంస్కార హీనమైన భాష వాడుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్ ఏపీ పేరు ప్రస్తావించకుండా నాలుగు అంశాలు లేవనెత్తారని కనకమేడల చెప్పుకొచ్చారు. విద్యుత్, రోడ్లు, నీరు, అభివృద్ధి లేకపోవడంపై ఆయన మాట్లాడారని, కేటీఆర్ పొరుగు రాష్ట్రమంటే అది తమ రాష్ట్రమే అనుకుని అరడజను మంది మంత్రులు స్పందించారని ఎద్దేవా చేశారు. ఏపీ పరిస్థితులపై ఈరోజు కేటీఆర్ మాట్లాడినా, టీడీపీ ఎప్పటినుంచో రాష్ట్ర పరిస్థితులపై ఆవేదన వెళ్లగక్కుతోందని ఆయన చెప్పారు. కేటీఆర్ భవిష్యత్‌తో ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పిన కనకమేడల, లోపాయికారిగా టీఆర్ఎస్‌తో పని చేయాలి కాబట్టే ఆయన వ్యాఖ్యలపై సీఎం మాట్లాడలేకపోయారని విమర్శించారు.

మోటర్లకు మీటర్లు పెట్టుకోవడానికి జగన్ ఒప్పుకున్నారని గతంలో హరీష్ రావు వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఏపీలో మూడెకరాలు వస్తాయన్న కేసీఆర్ మాటలు నిజమా కాదా అనేది వైసీపీ నేతలే చెప్పాలని కనకమేడల రవీంద్రకుమార్ డిమాండ్ చేశారు. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయన్న ఆయన, రాష్ట్రంలో ఎక్కడ రోడ్లు వేశారో, ఎన్ని నిధులు కేటాయించారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉండేదని, పీపీఏ అగ్రిమెంట్లు రద్దు చేసి విద్యుత్ సంక్షోభానికి కారకులయ్యారని మండిపడ్డారు. ఆరు సార్లు రేట్లు పెంచి 15 వేల కోట్లు ప్రజలపై భారం మోపారన్న కనకమేడల, సోలార్, విండ్ పవర్ సంస్థలపై దాడులు చేసి అగ్రిమెంట్లు రద్దు చేసి కోర్టుల్లో పోరాడుతున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల నిర్మాణానికి ముందుకు రావడం లేదని పార్లమెంట్‌లో కేంద్రం ప్రకటించిందని, రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయడానికీ ముందడుగేయట్లేదని రైల్వే మంత్రి చెప్పారని ఆయన విమర్శించారు.

గతంలో రోడ్లు నిర్మించిన వారికి బిల్లులు చెల్లించకుండా సొంత అవసరాలకు నిధులు వాడుకున్నారని ఆరోపించారు. ఏపీకి ఎంత ఆదాయం వస్తుంది? ఎంత సంక్షేమానికి ఖర్చు పెడుతున్నారని కనకమేడల ప్రశ్నించారు. 2019-20 లో ఏపీకి రూ. 1,55,076 కోట్లు, 2020-2021లో రూ. 1,86,551 కోట్ల ఆదాయం, 2021-22 లో రూ. 1,81,855 కోట్ల ఆదాయం వచ్చిందని ఆయన లెక్కలు చెప్పారు. టీడీపీ హయాంలో వచ్చిన ఆదాయం కంటే ఎక్కువ ఆదాయం వచ్చిందని తెలిపారు. 2019-20లో సంక్షేమ పథకాలకు రూ. 43,574 కోట్లు ఖర్చు చేశారని, 2020-21లో 47 వేల కోట్లు, 2021-22లో రూ. 47,937 కోట్లు సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టారని వివరించారు. 38 శాతం నిధులు సంక్షేమానికి ఖర్చు చేస్తే మిగతా 62 శాతం ఏమైందని ప్రశ్నించారు. ప్రస్తుతం రూ. 7,96,000 కోట్లు ఏపీకి అప్పులున్నాయని, జగన్ పాలనలో ఆరు లక్షల 20 వేల కోట్లు అప్పులు చేశారని ధ్వజమెత్తారు. సంక్షేమానికి ఖర్చు చేసేది తక్కువ-అప్పులు చేసేది ఎక్కువ అని ఆయన ఎద్దేవా చేశారు. ఇకనైనా తప్పులను సరిదిద్దుకోకపోతే ప్రజలే గద్దె దించుతారని ఎంపీ కనకమేడల హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement