Thursday, November 7, 2024

AP: బ్యారేజీ వద్ద పడవల తొలగింపు పని ప్రారంభం…

(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కృష్ణమ్మ ఎగువ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున వచ్చిన వరదల్లో బ్యారేజీ వద్దకు కొట్టుకువచ్చిన పడవుల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు ముమ్మరం చేశారు. ఈనెల 1వ తేదీన సుమారు 20 నుండి 50 టన్నుల బరువు ఉండే ఐదు పడవలు వరదనీటిలో కొట్టుకువచ్చి బ్యారేజీ వద్ద ఉన్న 67, 69, 70 గేట్లను బలంగా ఢీకొట్టాయి. పడవలు బలంగా 67, 69, 70 గేట్ల ఢీకొట్టడంతో అక్కడ ఉన్న కౌంటర్ వైట్లు దెబ్బతిన్నాయి.

నీటి ప్రవాహం కూడా సుమారు 11 లక్షల 47 వేల క్యూసెక్కులకు చేరుకున్న నేపథ్యంలో దెబ్బతిన్న కౌంటర్ వైట్లు పునరుద్దించడం అధికారులకు కష్టంగా మారింది. నీటి ప్రవాహం పూర్తిగా తగ్గి రెండు లక్షల క్యూసెక్కుల లోపు చేరుకున్న నేపథ్యంలో సుమారు 17 టన్నుల బరువు ఉండే 3 కౌంటర్ వైట్లను తిరిగి యధాస్థానంలో కొత్త వాటిని బిగించారు. సలహాదారుడు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో డ్యామ్ సేఫ్టీ అధికారులు, ఇంజనీర్లు, బ్యారేజీ అధికారులు సిబ్బంది పర్యవేక్షణలో హైదరాబాద్ కు చెందిన ఒక ప్రైవేట్ సంస్థ ఈ కౌంటర్ వైట్లను బిగించింది.

- Advertisement -

బ్యారేజీ వద్దకు వచ్చి బలంగా ఢీకొట్టిన పడవల అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చ‌నీయాంసమైన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి, ఇందులో దాగి ఉన్న కుట్ర కోణాన్ని బయటకు తీసి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఇదే సందర్భంలో బ్యారేజీ నీటి ప్రవాహానికి అడ్డంగా ఉన్న పడవలను తొలగించే కార్యక్రమాన్ని అధికారులు మంగళవారం చేపట్టారు. బ్యారేజీ వద్దకి ఐదు బొట్లు కొట్టుకుని రాగా, అందులోని ఒక చిన్న బోటు నీటి ప్రవాహంలో కిందుకు వెళ్లిపోయింది.

ప్రస్తుతం ఉన్న నాలుగు బోట్లలో మూడు భారీ బోట్లు కాగా, ఒకటి మధ్య స్థితిగా ఉందని అధికారులు చెబుతున్నారు. నీటి ప్రవాహానికి అడ్డంగా ఉన్న పడవలు ఒక్కొక్కటి 20 నుండి 50 టన్నుల బరువు ఉన్న నేపథ్యంలో రెండు భారీ క్రేన్ల సహాయంతో వీటిని తొలగించే ప్రయత్నం చేశారు. డ్యామ్ సేఫ్టీ అధికారులు, అపార అనుభవం ఉన్న ఇంజనీర్ల, బ్యారేజీ అధికారుల సమక్షంలో 50టన్నుల బరువు ఉండే రెండు క్రేన్ల సహాయంతో బోట్లు తొలగించే కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది.

ఈ బోట్లను మూడు విధాలుగా తొలగించేందుకు అధికారులు ప్లాన్లను సిద్ధం చేశారు. ప్రస్తుతం బ్యారేజీకి అడ్డంగా ఉన్న బాట్లను సరిచేసి, గేట్ల ద్వారా దిగువకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ అది సాధ్యపడని పక్షంలో పడవులను రెండు భాగాలుగా గ్యాస్ కట్టర్లతో విభజించి వరద నీటిలో దిగువకు పంపించే ప్రయత్నం చేయనున్నారు. ఇది కూడా సాధ్యపడని పక్షంలో మూడవ ప్రయత్నంగా భారీ పంతులను తీసుకువచ్చి పడవలను కృష్ణానది ఎగువ ప్రాంతానికి లాక్కెళ్లే ప్రయత్నం చేయనున్నారు. మంగళవారం రాత్రి సమయానికి బోట్ల తొలగింపు ప్రక్రియ పూర్తి కాగలదని అధికారులు చెబుతున్నారు..

నిలకడగా కృష్ణమ్మకు వరద నీరు..
ఇటీవల మహోగ్రరూపం దాల్చిన కృష్ణ నీటి ప్రవాహం నిలకడగా ఉంది. ఈనెల 1వ తేదీన వచ్చిన భారీ వరదలు, వర్షాల కారణంగా కృష్ణా నదికి ఒకానొక దశలో 11లక్షల 44 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. దీంతో బ్యారేజీ గేట్లు అన్ని ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే గడిచిన నాలుగు రోజులుగా నీటి ప్రవాహం తగ్గుతూ వచ్చి మళ్ళీ ఒక్కసారిగా 5 లక్షల పైగా క్యూసెక్కుల వరద నీరు రావడంతో అప్రమత్తమైన అధికారులు గేట్లను దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మంగళవారం నాటికి బ్యారేజీ వద్ద రెండు లక్షల 9 క్యూసెక్కుల వరద నీటి ప్రవాహం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement