తిరుపతి సిటీ, ప్రభన్యూస్ : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ కార్యక్రమానికి తిరుపతి రైల్వేస్టేషన్‌లో శుక్రవారం శ్రీకారం చుట్టారు. గుంతకల్ డివిజన్‌లోని తిరుపతి రైల్వే స్టేషన్‌లో ఈ వినూత్న కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా 15 రోజులు నిర్వహించ నున్నారు. స్థానిక హస్త కళాకారులు, కుమ్మరులు, చేనేత వస్త్రాలు, గిరిజనఉత్పత్తులను ప్రోత్సహించేలా రైల్వే ష్టేషన్‌ను విక్రయ కేంద్రంగా ఉపయోగించుకునే ప్రధాన లక్ష్యంతో 2022-23 కేంద్ర బడ్జెట్‌లో వన్ స్టేషన్ వన్ ప్రోడెక్ట్ విధానాన్ని రైల్వే శాఖ ప్రకటించింది. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే భక్తులతో తిరుపతి రైల్వే స్టేషన్ నిత్యం రద్దీగా ఉంటుంది.
అందుకే ఉత్పత్తుల విక్రయానికి ఈ స్టేషన్‌ను ఎంపిక చేశారు. ఇక్కడ స్టాల్స్ ఏర్పాటుకు భారీగా దరఖాస్తులు అందాయి. వీటిని పరిగణనలోకి తీసుకొని కలంకారి వస్త్రాలు, హస్తకళలు, ఉడ్ కార్వింగ్స్‌కు సంబంధించిన ఉత్పత్తుల స్టాళ్ల ఏర్పాటు-కు గుంతకల్ డివిజన్ అనుమతులిచ్చింది. స్టాల్స్ ఏర్పాటుకు కృషి చేసిన అధికారులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కిశోర్ అభినందించారు.