సత్యవేడు (రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో) : తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీ సెజ్ లో జపాన్ కు చెందిన ఎయిర్ కండిషనింగ్ తయారీ కంపెనీ డైకిన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (డిఐఎల్) అనుబంధ యూనిట్ కు ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది. ఈ యూనిట్ దేశంలోనే ఆ సంస్థకు చెందిన మూడవ యూనిట్ కాగా, ఆగ్నేయాసియా ఖండంలో అతి పెద్దది కావడం విశేషం. జపాన్ కాన్సుల్ జనరల్ మసయుకి టాగా, ఇన్వెస్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ నివృతి రాయ్, జపాన్లోని మాజీ భారత రాయబారి సుజన్ చినోయ్, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సమక్షంలో డిఐఎల్ సీఈఓ, ప్రెసిడెంట్ మసనోరి తోగావా, డైకిన్ ఇండియా ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కన్వల్జీత్ జావా నూతన ఉత్పత్తి కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. 2050 నాటికి నికర జీరో కార్బన్ ఉద్గారాలను సాధించాలనే డైకిన్ ఆకాంక్షకు అనుగుణంగా, దేశీయ అవసరాలతో పాటు పశ్చిమ ఆఫ్రికా, శ్రీలంక, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్, మధ్యప్రాచ్యం, దక్షిణ అమెరికా, తూర్పు ఆఫ్రికా వంటి ఎగుమతి మార్కెట్లకు సేవలందించేందుకు వాతావరణ అనుకూల ACలు ఇక్కడ తయారవుతాయి. ఎయిర్ కండీషనర్ల దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అమలు చేసిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) లో భాగంగా డైకిన్ భారీ పెట్టుబడితో ప్లాంట్ ఏర్పాటు చేపట్టింది.
శ్రీసిటీ డొమెస్టిక్ టారిఫ్ జోన్ (డీటీజడ్)లోని 75.5 ఎకరాల స్థలంలో భారీ పెట్టుబడితో నిర్మించిన ఈ ప్లాంట్లో ఏడాదికి 1.5 మిలియన్ ఏసీ యూనిట్లతో పాటు కంప్రెసర్లు, కంట్రోలర్ బోర్డులు, ఇతర విడిభాగాలను ఉత్పత్తి చేయనున్నారు. పెరుగుతున్న దేశీయ, అంతర్జాతీయ డిమాండ్ కు అనుగుణంగా ఈ ఫ్యాక్టరీ అత్యాధునిక ఉత్పత్తులను అందిస్తుంది. డైకిన్ ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ మసనోరి తోగావా, డైకిన్ ఇండియా ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జావా మాట్లాడుతూ… జపాన్ పెట్టుబడిదారులకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని ప్రశంసించారు. ఆకర్షణీయ పెట్టుబడి గమ్యస్థానంగా అభివృద్ధి చెందుతున్న శ్రీసిటీ ప్రపంచ స్థాయి మౌళిక సదుపాయాలను ఆయన కొనియాడారు. జపాన్ నిరంతరాయంగా భారతదేశాన్ని ఒక అగ్రశ్రేణి పెట్టుబడి గమ్యస్థానంగా చూస్తున్నందుకు నివృతి రాయ్ తన సంతృప్తిని వ్యక్తం చేశారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ… వైట్-గూడ్స్ రంగానికి అనుకూలమైన పర్యావరణ వ్యవస్థతో పాటు అనేక ప్రధాన AC బ్రాండ్ల ఉనికితో ప్రస్తుతం భారతదేశానికి కూల్ క్యాపిటల్ గా శ్రీసిటీ మారుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర డిపిఐఐటి, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ డి.బాలమురుగన్, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజెన్సీ (ఏపీఈ ఐటీఏ) గ్రూప్ సీఈఓ కిరణ్ సలికిరెడ్డి, తిరుపతి పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ వి.రామకృష్ణ రెడ్డి, తిరుపతి జిల్లా అగ్నిమాపక అధికారి రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.