Wednesday, November 27, 2024

AP | పరమాత్ముడైన హరి పట్టపురాణి బ్రహ్మోత్సవం ప్రారంభం

ఆగమోక్తంగా అంకుర ఆరోపణం 
రేపు గజ ధ్వజారోహణం
డిసెంబర్ 6న పంచమీ తీర్థం 
తిరుపతి, ఆంధ్రప్రభ బ్యూరో (రాయలసీమ) : తొలి తెలుగు సంకీర్తనాచార్యులు అన్నమయ్య పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు అని కీర్తించిన తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు రాత్రి ఆగమోక్తంగా జరిగిన అంకుర ఆరోపణంతో నాంది పలికిన బ్రహ్మోత్సవాలు రేపు జరిగే గజ ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి. ఈ ఉత్సవాల్లో ప్రధానమైన పంచమీ తీర్థ మహోత్సవం డిసెంబర్ 6వ తేదీన ఆలయ పద్మ పుష్కరిణి లో జరగనున్నది.

  

అలిగి వైకుంఠం వీడిన లక్ష్మీదేవి కోసం భూలోకానికి వచ్చిన శ్రీ మహావిష్ణువు తిరుమల కొండపై శ్రీనివాసుడుగా పూజలందుకున్నట్టే మహాలక్ష్మి కొల్హాపూరుకు తరలివెళ్లి పోగా ఆమె వ్యూహ రూపమైన పద్మావతి లక్ష్మీదేవితో ఐక్యమై పోయిందని పురాణాలు పేర్కొంటున్నాయి. లక్ష్మీదేవి కోసం తిరుచ్చుకనూరు (ఇప్పటి తిరుచానూరు) వద్ద పుష్కరకాలం శ్రీనివాసుడు చేసిన తపస్సు ఫలితంగా పద్మ సరోవరం నుండి పద్మావతి ఆవిర్భవించినట్టు కూడా పురాణాలు తెలియచేస్తున్నాయి. ఆ విధంగా పుష్కరిణీ జలాలలోని ఉద్భవించిన పద్మావతి స్వతంత్ర వీరలక్ష్మిగా అక్కడి పురాతన కృష్ణస్వామి ఆలయ ప్రాంగణంలో కొలువై తరతరాలుగా పూజలందుకుంటూ ఉన్నది. తమిళ భాష ప్రకారం మలర్ (పద్మం) మేల్ (పైన) మంగై (స్త్రీ) గా ఉద్బవించిన పద్మావతిని అలమేలు మంగగా కూడా పేరొందడంతో తిరుచానూరు అలమేలు మంగాపురంగా కూడా ప్రసిద్ధిచెందింది.

పద్మావతి అమ్మవారు పద్మ సరోవరంలో ఆవిర్భవించిన రోజున పంచమీ తీర్థ మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ రోజుకు తొమ్మిది రోజులు ముందుగా నిర్వహించే ధ్వజారోహణంతో తిరుచానూరు బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. అమ్మవారు ఉద్భవించిన కార్తీక శుద్ధ శ్రవణ నక్షత్ర శుభ ఘడియల్లో పుష్కరిణి ఒడ్డున ఉన్న పంచమీ తీర్థ మండపంపై అమ్మవారికి పాంచరాత్ర ఆగమోక్తంగా పంచ కలశ తిరుమంజనం నిర్వహించి, ఆమె ప్రతినిధిగా సుదర్శన చక్రాన్ని పుష్కరిణీ జలాల్లో స్నాపనం చేయించడమే పంచమీ తీర్థ విశేషం. ఆ రోజున ఉదయం తిరుమల క్షేత్రం నుంచి అర్చకులు వెంకటేశ్వర స్వామి తరపున పసుపుకుంకుమలు, దివ్య ఆభరణాల అప్పాపడిని ఏనుగుపై ఊరేగిస్తూ తిరుచానూరుకు తీసుకువస్తారు.

- Advertisement -

చక్రస్నానం నిర్వహించే క్షణాల కోసం ఎదురుచూసే లక్షలాది మంది భక్తులు పుష్కరిణీ జలాల్లో పుణ్యస్నానాలు చేస్తారు. ఈ ఏడాది డిసెంబర్ 6వ తేదీన నిర్వహించే పంచమీ తీర్థ మహోత్సవం కోసం టీటీడీ, పోలీసు యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక బ్రహ్మోత్సవాలకు నాందిగా ఈరోజు సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ఆగమోక్తంగా అంకుర ఆరోపణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు. రేపు ఆలయ ప్రాంగణంలోనే ధ్వజ స్థంభంపై గజ పతాకాన్ని ఎగురవేయడంతో ఉత్సవాలు మొదలవుతాయి. ఆపి ఎనిమిది రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం, రాత్రి వేళల్లో రెండు వాహనాలలో ఆలయ మాడ వీధుల గుండా ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఉత్సవాల్లో ప్రధానంగా డిసెంబర్ 2వ తేదీ రాత్రి జరిగే గజ వాహన సేవకు తిరుమలేశుని గరుడ సేవకు ఉన్నంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే వేలాది మంది భక్తులను దృష్టిలో ఉంచుకుని టి టి డి అన్నిరకాల ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement