Friday, November 22, 2024

ఏపీకి రండి, అభివృద్ధి చూపిస్తాం.. కేటీఆర్‌ వ్యాఖ్యలపై జోగి రమేష్ ఫైర్‌

అమరావతి, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లో క్రెడాయ్‌ ప్రాపర్టీ షోలో పక్క రాష్ట్రం అంటూ సంబోధిస్తూ తెలంగాణ‌ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు వైకాపా నేతలు వరుసగా కౌంటర్లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి జోగి రమేష్‌ స్పందించారు. ఏపీలో తమ ప్రభుత్వ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏంటో కళ్లారా చూసి తెలుసుకోవాలని కేటీఆర్‌కు జోగి రమేష్‌ సవాల్‌ విసిరారు. ఏపీ అభివృద్ధిని చూసి ఓర్వలేక కేటీఆర్‌ విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ తరహాలోనే కేటీఆర్‌ కూడా కాకమ్మ, పిట్ట కథలు చెబుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ విజయవాడకు వచ్చి చూస్తే ఏపీ అభివృద్ధి అంటే ఏంటో తెలుస్తుందని మంత్రి జోగి రమేష్‌ హితవు పలికారు.

ఏపీ అభివృద్ధిని చూసేందుకు అందరినీ ఆహ్వానిస్తున్నామన్నారు. ఏపీలో తాగు, సాగు నీటికి సమస్య లేదన్నారు. వ‌లంటీర్ల వ్యవస్థతో ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని జోగి రమేష్‌ వివరించారు. ఏపీకి వస్తే అమ్మ ఒడి కనిపిస్తుందని.. ఏపీకి వస్తే ఆసరా కనిపిస్తుందని.. 31 లక్షల మందికి ఇళ్లు కట్టించే పట్టణాల నిర్మాణం కనిపిస్తుందని… ప్రతి గ్రామంలో సచివాలయం కనిపిస్తుందని.. డిజిటల్‌ లైబ్రరీ కనిపిస్తుందని జోగి రమేష్‌ అన్నారు. ఇక్కడి సచివాలయాల వ్యవస్థ గురించి తమిళనాడు సీఎం స్టాలిన్‌ కూడా అసెంబ్లీ సాక్షిగా ప్రశంసించారని జోగి రమేష్‌ గుర్తుచేశారు. ఒక్క స్టాలిన్‌ మాత్రమే కాదని.. అన్ని రాష్ట్రాల సీఎంలు జగన్‌ పాలన గురించి మెచ్చుకుంటు-న్నారని మంత్రి పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement