Friday, November 22, 2024

Challenge: సీమ ప్రాజెక్టులపై దమ్ముంటే నాతో చర్చకు రండి.. చంద్రబాబుకు పెద్దిరెడ్డి సవాల్

తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో) : చంద్రబాబుకు దమ్ముంటే రాయలసీమ నీటి ప్రాజెక్టుల విషయంలో ఎవరి ప్రభుత్వ హయాంలో ఎంత అభివృద్ధి పనులు జరిగాయో తేల్చుకోడానికి తనతో చర్చకు సిద్ధం కావాలని రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సవాల్ విసిరారు. ఈ రోజు తిరుపతిలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… 14ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు రాయలసీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిన చంద్రబాబుకు సీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. అందుకే 2019 ఎన్నికల్లో సీమ జిల్లాల ప్రజలు మొత్తం 52అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీని మూడు స్థానాలకే పరిమితం చేశారన్నారు.

ఓడిపోయిన తరువాత సీమపై కక్ష్యలు కట్టి పెండింగ్ ప్రాజెక్టుల పనులు జరగనివ్వకుండా కేసులు పెట్టి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 14 ఏళ్ళు సి ఎం గా  పని చేసిన చంద్రబాబు తనను ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన కుప్పం ప్రజలకు కూడా మేలు చేయలేదని విమర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి 80శాతం పూర్తి చేసిన హంద్రీ నీవా ప్రాజెక్టులో భాగమైన కుప్పం బ్రాంచి కాలువను పూర్తి చేయలేక పోయారంటూ ఇచ్చిన మాటకు కట్టుబడి తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి మరో రెండు నెలల్లో కుప్పం ప్రాంతానికి నీళ్లు ఇవ్వనున్నారన్నారు. కుప్పం ప్రాంతానికి తాగు నీళ్లు ఇచ్చే పాలార్ ప్రాజెక్టు కు వైఎస్ రాజశేఖర రెడ్డి పూర్తి చేయడానికి యత్నిస్తే తమిళనాడు ప్రభుత్వంలోని వారితో కుమ్మక్కై రాష్ట్ర వివాదం పేరుతో అడ్డుకున్నారని ఆరోపించారు.

- Advertisement -

రాయలసీమ ప్రాజెక్టుల విషయానికి వస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యాన్ని 11 వేల  క్యూసెక్కుల నుంచి  44 వేల క్యూసెక్కులకు విస్తరింపచేస్తే చంద్రబాబు నాయకత్వంలో ప్రకాశం బ్యారేజ్ పైన దేవినేని ఉమా, నాగం జనార్ధన రెడ్డిలతో నిరసన ర్యాలీ చేయించారని, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి 60వేల క్యూసెక్కులకు పెంచడానికి కృషి చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తెలిపారు. ఇక వివిధ ప్రభుత్వాల విషయానికి వస్తే 1995-2004 మధ్యకాలంలో తెలుగుగంగకు రూ.1,788 కోట్లు వెచ్చిస్తే 2004-2014 మధ్యకాలంలో రూ.2, 233 కోట్లు వ్యయం చేశారని, గాలేరు నగరి ప్రాజెక్టుకు చంద్రబాబు ప్రభుత్వం రూ.17.52 కోట్ల నామమాత్రపు నిధులు వెచ్చిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రూ. 428 కోట్లు వెచ్చించిందని తెలిపారు. అందులో భాగమైన గండికోట రిజర్వాయర్ ను చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 26 టి ఎం సి ల సామర్ధ్యానికి పెంచారన్నారు. హంద్రీ నీవా ప్రాజెక్ట్ విషయానికి వస్తే పైన ఉన్న స్థానిక సమస్యల కారణంగా దిగువన ఉన్న చిత్తూరు జిల్లాకు తగినన్ని నీళ్లు రాని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జగన్ మోహన్ రెడ్డి తమ జిల్లాలోని గండి కోట నుంచి ఎత్తిపోతల ద్వారా నీరు అందచేయడానికి మూడు రిజర్వాయర్లు నిర్మిస్తుంటే చంద్రబాబు తన మనుషుల ద్వారా గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేయించి ఆపు చేయించాడని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు.

అడుగడుగునా ద్రోహాలు చేసిన చంద్రబాబు ఇప్పుడు సీమ ప్రజలను మోసం చేయడానికి పర్యటనలు చేపడుతున్నారని అన్నారు. అదికేవలం ఏడుపు యాత్ర మాత్రమేనని అన్నారు. చంద్రబాబు చేసిన మోసాల ఫలితాలను ప్రత్యక్షంగా అనుభవిస్తున్న సీమ ప్రజలే తగువిధంగా తగిన సమయంలో బుద్ది చెబుతారన్నారు. నిజంగా చంద్రబాబుకు దమ్ము ఉంటె ఎవరి ప్రభుత్వ హయాంలో రాయలసీమ నీటి ప్రాజెక్టుల అభివృద్ధి పనులు ఎంత జరిగాయనే అంశంపై పుంగనూరులో అయినా, కుప్పంలో అయినా చర్చించడానికి రావాలని పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. సీమ జిల్లాల పర్యటన సందర్భంగా ఈనెల 4 వ తేదీన పుంగనూరు, పలమనేరు ప్రాంతాలకు రానున్న చంద్రబాబును అడ్డుకుంటారా అని ప్రశ్నించినప్పుడు ప్రజాస్వామ్యం పై నమ్మకం ఉన్న తాము అటువంటి పనులకు పాల్పడబోమని అన్నారు. కడుపుమండిన రైతులు చంద్రబాబును నిలదీసే అవకాశం ఉందా అని అడిగినప్పుడు  పోలీసులు తగు చర్యలు తీసుకుంటారని జవాబిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు, చిత్తూరు శాసన సభ్యుడు శ్రీనివాసులు, టి టి డి బోర్డు సభ్యుడు పోకల అశోక్ కుమార్, వై సి పీ నాయకుడు ఎం ఆర్ సి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement