Tuesday, November 26, 2024

Come Back leaders – గెలిస్తేనే మళ్లీ వ‌స్తా! ఇదే లీడర్ల ప్ర‌తిజ్ఙ….

ఏపీ, తమిళనాడు అసెంబ్లీలే సాక్ష్యం
అనాడు జయలలితకు వస్త్రాపహరణం
జగన్​పై చీత్కరాల దూషణల పర్వం
నేడు చంద్రబాబు వ్యక్తిగత హననం
ముగ్గురూ భీష్మ ప్రతిజ్ఞ చేసినోళ్లే
ఆ తర్వాత అసెంబ్లీలో ఘనంగా అడుగుపెట్టినోళ్లే
నిండు సభలో మర్యాదగా ఉంటేనే మనుగడ
లేకుంటే జనం చూస్తూ ఊరుకోరన్నది సత్యం
చారిత్ర‌క నేప‌థ్యం ఉన్న ఘ‌ట‌న‌లివే..

ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి: దక్షిణ భారతంలోని.. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభల్లోనూ. దుర్యోధన, దుశ్శాసన పర్వాలు చరిత్ర సృష్టించాయి. ఈ చారిత్రాత్మక ఘటనల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ సభల్లో ప్రతిపక్ష నేతను అధికార పక్షం అవమానించటం.. తనకు జరిగిన అవమాన భారాన్ని ఆక్రోశంతో వెళ్లగక్కి.. మళ్లీ అధినేతగా తిరిగి సభలోకి అడుగుపెడతామని ఆవేశంగా భీష్మ ప్రతిజ్ఞతో ప్రతిపక్ష నేత వెనుతిరగటం.. తిరిగి సీఎంగా గౌరవ వందనం స్వీకరించి సభలో ప్రవేశించే ఘటనలు పునరావృతం అవుతున్నాయి. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు రెండున్నర ఏళ్ల కిందట అవమాన భారంతో అసెంబ్లీని వీడారు. శుక్రవారం మళ్లీ అసెంబ్లీకి వచ్చారు. ప్రధాన ద్వారంలో ప్రణమిల్లి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఈ భీష్మ ప్రతిజ్ఞలు.. వాటి ప‌రంప‌ర తీరును గుర్తు చేసుకుందాం..

- Advertisement -

నాడు జయలలిత భీషణ ప్రతిజ్ఞ

1989 మార్చి 25న తమిళనాడు అసెంబ్లీలో ఓ అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఆ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి సభలో లేరు. ఈ విషయాన్ని అప్పటి ప్రతిపక్ష నాయకురాలు అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత నిలదీశారు. దీంతో ఆగ్రహానికి గురైన డీఎంకే సభ్యుల్లో ఒకరు జయలలిత కొంగు లాగారు. ఇదే భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో… తొలి దుశ్శాసన పర్వంగా యావత్ దేశం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఈ అవమాన భారంతో ఆమె ‘‘మళ్లీ సీఎం అయ్యేవరకు అసెంబ్లీలో పాదం మోపను’’ అని ప్రతిజ్ఞ చేశారు. ఆ మాటపైనే నిలబడ్డారు. 1996లో జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన జయ.. సీఎంగా అసెంబ్లీలో అడుగు పెట్టారు.

ఏపీలో వైఎస్ జగన్..

2014లో జరిగిన విభజిత రాష్ట్ర ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 67 సీట్లతో వైసీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. వివిధ రాజకీయ కారణాలు, వ్యవహారాలతో 23మంది వైసీపీ సభ్యులు టీడీపీలో చేరారు. వీరిలో కొందరు మంత్రులు కూడా అయ్యారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు చర్యలు తీసుకోలేదు. దీన్ని నిరసిస్తూ వైసీపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి 2017 నవంబర్ 25న ‘‘మళ్లీ సీఎం అయ్యేవరకు శాసనసభలోకి అడుగుపెట్టను’’ అంటూ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. పాదయాత్ర నిర్వహించారు. 2019 ఎన్నికల్లో151 స్థానాలతో సంచలన విజయం సాధించి సీఎం అయ్యారు. ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు.

ఇప్పుడు చంద్రన్న వంతు..

అసెంబ్లీలో అధికారపక్షంలోని మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) అనుబంధ సభ్యుడు వల్లభనేని వంశీ.. విపక్ష నేత చంద్రబాబును వ్యక్తిత్వ హననం చేసే రీతిలో తూలనాడారు. చివరికి ఆయన సతీమణి భువనేశ్వరి పేరునూ ప్రస్తావించారు. అసెంబ్లీలో సభ్యుల వ్యాఖ్యాలు తీవ్ర సంచలనం రేకెత్తించాయి. చంద్రబాబు చలించిపోయారు. ఘాటుగా స్పందించారు. ‘‘ఇది గౌరవ సభ కాదు.. కౌరవుల సభ.. ఇంతటి అవమానాలు ఊహించలేదు. చాలెంజ్ చేసి చెబుతున్నా.. మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీలోకి అడుగు పెడతా’’ అని సహచర సభ్యులతో కలిసి బయటికి వెళ్లిపోయారు. ఆ మరుసటి రోజు టీడీపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు కన్నీటి పర్యంతం అయ్యారు. ఇది బలంగా ప్రజల్లోకి వెళ్లింది. ఇప్పుడు జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి 164 స్థానాలతో అధికారంలోకి రాగా.. శుక్రవారం అసెంబ్లీలోకి అపూర్వ గౌరవ ఆహ్వానంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్​ కళ్యాణ్​ సభలోకి సంబురంగా అడుగుపెట్టారు.

ఒకటి నిజం.. అత్యుత్సాహం తగదు..

సభలో అధికార పక్షం మితిమీరి ప్రవర్తిస్తే జన చూస్తూ ఊరుకోరు. ఇది ముమ్మాటికీ నిజం. 2014 అసెంబ్లీలో విపక్ష నేత జగన్​ని ఎంతో చీత్కార వ్యాఖ్యలతో టీడీపీ సభ్యులు అవమానించారు. గజదొంగ అన్నారు. ఖైదీ అన్నారు. దోషిగా కోర్టు నిర్ధారించక ముందే టీడీపీ సభ్యులంతా అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇందులో అచ్చెన్నాయుడు, దూళిపాళ్ల నరేంద్ర, బొండా ఉమా మహేశ్వరరావు, దేవినేని ఉమామహేశ్వరరావు , జ్యోతుల నెహ్రు… ఇలా అసెంబ్లీలో జగన్​ని అవమానించిన టీడీపీ ఎమ్మెల్యేలందరినీ జనం గమనించారు. వీరిలో అచ్చెన్నాయుడు తప్పా ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎవరూ గెలవలేదు.

జగన్​ హయాంలోనూ..
ఇక.. ఆ తర్వాత జగన్​ హయాంలోనూ ఇదే జరిగింది.. జగన్​ నాయకత్వంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలూ ఎక్కడా తగ్గలేదు. చంద్రబాబును సూటి పోటీ మాటలే కాదు.. వ్యక్తిగత నిందలేశారు. కడకు ఆయన సతీమణినీ రచ్చకీడ్చారు. ఫలితంగా.. అంబటి రాంబాబు, అనిల్​ యాదవ్, కొడాలి నాని, పేర్ని నాని, రోజా.. వల్లభనేని వంశీ.. వీళ్లెవరినీ జనం వదలలేదు. వీరందరికీ అత్తారింటికి దారి చూపారు. ఏదైమైనా అసెంబ్లీలో సభ మర్యాద పాటించాలి. జనం సమస్యలపైనే మాట్లాడాలనేది స్పష్టం అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement