Friday, November 22, 2024

వైద్యశాఖలో ఖాళీల భర్తీకి కంబైన్డ్‌ నోటిఫికేషన్‌.. వేర్వేరుగా ఇవ్వొద్దని ఆదేశాలు..

అమరావతి, ఆంధ్రప్రభ: వైద్యశాఖలో ఖాళీల భర్తీకి సంబంధించి కంబైన్డ్‌ నోటిఫికేషన్‌ ద్వారానే నియామకాల ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ వేర్వేరుగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసేవి. ఈక్రమంలో నియామక ప్రక్రియలో తీవ్ర జాప్యం చోటు చేసుకొనేది. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర, జిల్లాస్థాయి లోనూ కంబైన్డ్‌ నోటిఫికేషన్‌ జారీ చేసి ఉద్యోగాల భర్తీని వేగవంతం చేసేలా చర్యలు చేపట్టనుంది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర సంబంధిత అధికారులకు గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఇకపై రాష్ట్రస్థాయిలో హెల్త్‌ డైరెక్టర్‌ , జిల్లాస్థాయిలో డీఎంఅండ్‌హెచ్‌ఓ కంబైన్డ్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడం ద్వారా పోస్టుల్ని భర్తీ చేయనున్నారు.

హెచ్‌ఓడీలు వేర్వేరుగా నోటిఫికేషన్‌ జారీ చేయడం వల్ల ఒకచోట విధుల్లో చేరిన ఉద్యోగి అక్కడ రాజీనామా చేసి వేరే హెచ్‌ఓడీలో జాయిన్‌ అవ్వడం వల్ల ఖాళీల భర్తీలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. కంబైన్డ్‌ నోటిఫికేషన్‌తో దీనికి చెక్‌ పెట్టాలని నిర్ణయించింది. జిల్లాస్థాయిలో నియామకాలకు సంబంధించి ప్రత్యేకంగా సీనియర్‌ అధికారిని నామినేట్‌ చేసి నియామక ప్రక్రియను చేపట్టే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి పోస్ట్‌కి అర్హతల్ని ప్రమాణీకరణ చేసి దాని ఆధారంగా రిక్రూట్‌మెంట్‌ చేసేలా నిబంధనల్ని విధించారు. ఇప్పటికే ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి వేర్వేరు నోటిఫికేషన్లు ఇవ్వొద్దని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement