• ఉద్యోగాల కల్పన చాలా ప్రధానమైన అంశం
• వచ్చే సమావేశానికి ఒక్కో జిల్లాలో ఎన్ని ఉద్యోగాలు కల్పించామనే వివరాలతో రావాలి
• నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలి
• రైతులను భాగస్వాములను చేయండి.
• అంతిమ లబ్దిదారులుగా వారుండేలా ప్రోత్సహించాలి
• పరిశ్రమలకు అనుమతులిచ్చే విషయంలో అసలత్వం తగదు.
• గతంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామికవేత్తలు భయపడ్డారు.
• ఇప్పుడు ఆ పరిస్థితి పోగొట్టి మళ్లీ అనుకూల వాతావరణం కల్పించాలి.
- కలెక్టర్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశం
ప్రతి జిల్లాలో ఎన్ని ఉద్యోగాలు కల్పించామనేది ప్రాతిపదికగా జిల్లా కలెక్టర్లు పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. కలెక్టర్ల సదస్సులో భాగంగా రెండో రోజు పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ ఆ శాఖ ప్రగతిపై ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనిపై సీఎం మాట్లాడుతూ.. 20 లక్షల ఉద్యోగాల కల్పన ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి జిల్లాలోనూ ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయి? వచ్చిన పెట్టుబడుల ద్వారా ఎన్ని ఉద్యోగాలు కల్పించామనే అంశాలపై దృష్టిపెట్టాలన్నారు. ప్రతి జిల్లా కలెక్టరు రాబోయే కలెక్టర్ల సదస్సుకు దీనిపైన స్పష్టమైన వివరాలతో రావాలని సూచించారు. పెట్టుబడులకు సంబంధించి జిల్లాలో నిర్వహించాల్సిన సమావేశాల పట్ల కలెక్టర్లు శ్రద్దకబరచకపోవడంపై సీఎం అసంత్రుప్తి వ్యక్తం చేశారు. చిత్తూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలు అసలు ఒక్క సమావేశం నిర్వహించకపోవడం సరికాదన్నారు. స్పీడ్ ఆఫ్ బిజినెస్ పనులు వేగవంతంగా చేయాలన్నారు.
రైతులను భాగస్వాములను చేయండి
జిల్లాల్లో పరిశ్రమలు నెలకొల్పడంలో, భూసేకరణలో రైతులను భాగస్వాములను చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. రైతులందరరూ కలిసి తమ భూములను ఒక ఇండస్ట్రియల్ పార్కుగా వారే అభివ్రుద్ది చేసుకుంటామని ముందుకొస్తే వారికి ప్రోత్సాహమివ్వాలని, రైతుల నుంచి పరిశ్రమల కొరకు భూములు సేకరించాల్సి వచ్చినప్పుడు వారిని భాగస్వాములను చేసి అంతిమంగా భూములిచ్చిన రైతులు ఎక్కువ లబ్ది పొందేలా కలెక్టర్లు వ్యవహరించాలన్నారు. దీనికి అమరావతి రాజధానికి చేపట్టిన భూ సేకరణను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
అనుమతుల జాప్యం తగదు
పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయడంలో అదికారులు, జిల్లా కలెక్టర్లు ఎంతమాత్రం జాప్యం ప్రదర్శించకూడదన్నారు. జాప్యం జరిగితే ఒక్కోసారి మనవద్ద పెట్టుబడి పెట్టడానికి వచ్చిన పరిశ్రమలు వెళ్లిపోయే ప్రమాదముంటుంది. కొన్ని పెద్ద, పెద్ద పరిశ్రమల స్థాపన ప్రతిపాదనలకు అనుమతులు ఆరు నెలలు, సంవత్సరం ఆలస్యమైతే కొన్నిసార్లు ఆ ప్రాజెక్టే సాధ్యం కాకుండా పోయే ప్రమాదముంటుందన్నారు.
అనుకూల వాతావరణం కల్పించాలి
గతంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామివేత్తలు బయపడే పరిస్థితులు నెలకొన్న విషయాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. పరిశ్రమ పెట్టడానికి వచ్చిన వారిని గత ప్రభుత్వంలో బెదిరించారు. వారిని ఇబ్బందుల పాలు చేశారు. కొంతమంది పరిశ్రమలు పెట్టినవారు భయపడి పొరుగు రాష్ట్రాలకు పారిపోయారు. వారు పోతూ పోతూ మేం ఇక జన్మలో ఏపీలో పెట్టుబడులు పెట్టమని ఆవేదన వ్యక్తం చేస్తూ వెళ్లిన రోజులున్నాయని సీఎం చెప్పారు. ఇప్పుడిప్పుడే పరిస్థితిని గాడిలో పెడుతున్నాం. పెట్టుబడులు పెట్టడానికి ఏపీలో అనుకూల వాతావరణం కల్పిస్తున్నాం. అలాంటి అనుకూల వాతావరణాన్ని పునర్నిమించేందుకు జిల్లా కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలన్నారు.
భూ సేకరణలో కలెక్టర్లదే కీలక పాత్ర: యువరాజ్
జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన భూ సేకరణకు సంబంధించి జిల్లా కలెక్టర్లదే కీలకపాత్ర అని పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని దీనికి అనుగుణంగా జిల్లా కలెక్టర్లు పనిచేయాలని కోరారు. ప్రతి కుటుంబానికో పారిశ్రామికవేత్త అనే నినాదంతో ప్రభుత్వం ముందుకెళుతోందని, దీనిని సాధిండంలో భాగంగా రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలపై సర్వే చేస్తున్నామని, అది జిల్లాల్లో సవ్యంగా జరిగేలా చూడాలని కోరారు. రాష్ట్రంలో 1.40 కోట్ల కుటుంబాలున్నాయని, అలాగే 34 లక్షల ఎంఎస్ఎంఈలు ఉన్నాయన్నారు. దీనిపైన క్షేత్రస్థాయిలో సర్వే సరిగ్గా జరిగేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఐటీ పార్కుల కొరకు భూములు గుర్తించండి
రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐటీ పార్కులు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీనికి సంబంధించి భూములు గుర్తించడానికి కలెక్టర్లు పనిచేయాలన్నారు. విశాఖపట్నంలోని మధురవాడ, కాపులుప్పాడలో 200 ఎకరాల్లో ఐటీ పార్కు ఏర్పాటు చేయనున్నామని, దీనికి సంబంధించిన స్థలాన్ని గుర్తించాలన్నారు. అలాగే మంగళగిరిలో ఐటీ పార్కు ఏర్పాటుకు కావాల్సిన 200 ఎకరాల స్థలం గుర్తించాలన్నారు. కడపలోని కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయనున్నామన్నారు. అలాగే తిరుపతిలో కూడా ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్ కొరకు 500 ఎకరాల స్థలం గుర్తించే అంశంపైనా ఆ జిల్లా కలెక్టరు ప్రయత్నించాలని కోరారు. అలాగే తిరుపతి నగర పరిధిలో ఐటీ పార్కు ఏర్పాటుకు 50 ఎకరాల స్థలం కావాలన్నారు. తిరుపతిలో నేషనల్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (National Institute of Electronics and Information Technology –NIELIT) ఏర్పాటుకు అవసరమైన 15 ఎకరాల స్థలాన్ని కూడా వెంటనే గుర్తించాలని కోరారు.