Wednesday, December 4, 2024

AP | సీఎం చంద్రబాబు అధ్యక్షతన 10, 11 తేదీల్లో కలెక్టర్ల సదస్సు…

జిల్లా కలెక్టర్ల సదస్సుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చిన తర్వాత రెండవ కలెక్టర్ల సదస్సును ఈనెల 10,11 తేదీల్లో నిర్వహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఆరు నెలలు అవుతోన్న నేపథ్యంలో తమ ప్రభుత్వ ప్రాధాన్యాలను కలెక్టర్లకు సీఎం చంద్రబాబు నాయుడు వివరించనున్నారు.

ఇప్పటికే అధికారుల బదిలీలు పూర్తిస్థాయిలో చేపట్టిన ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి పై పూర్తి ఫోకస్‌ పెట్టింది. దీనికి సంబంధించిన ప్రణాళికలను కలెక్టర్ల ముందు ఉంచనున్నారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలు, సహజ వనరుల దోపిడీపై ప్రత్యేకంగా దృష్టిసారించిన కూటమి ప్రభుత్వం వాటిని వెలికితీసి చట్టపరంగానే వారిపై ఇప్పటికే చర్యలకు ఉపక్రమించింది.

ఇంకోవైపు భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులుకు సిద్ధమైన సర్కార్‌ ఆ అంశం పై కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేయనుంది. ఇక రేషన్‌ బియ్యం దారిమళ్లింపు, విదేశాలకు అక్రమ తరలింపు అడ్డుకోవడం పై సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నారు.

ఈ సదస్సులో ప్రధానంగా రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకెళ్లాలంటే ముందుగా మౌలిక సదుపాయాలు కల్పించాలని అప్పుడే పెట్టుబడిదారులు పరుగులు తీస్తారని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా పోర్టులు, షిప్పింగ్‌ హార్బర్లు, జాతీయ రహదారులు, రైల్వేప్రాజెక్టులు, పరిశ్రమలకు అవసరమైన భూసేకరణ త్వరితగతిన చేపట్టాలని కలెక్టర్లకు నిర్దేశించనున్నారు.

పథకాల అమలు, వాటి ప్రచారం, ఇతర అంశాల పై సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇవ్వనున్నారు. కొత్త రేషన్‌ కార్డులు, ఫించన్లపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనున్నారు. పౌర సేవలు అన్నీ కార్యాలయాల్లో పూర్తి స్థాయిలో లభించేలా తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు.

- Advertisement -

పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా పలు కీలక అంశాలపై ఆయన కలెక్టర్లకు దిశా నిర్దేశం చేయనున్నారు.ఇంకోవైపు రాష్ట్రంలో శాంతి భద్రతల అంశం పై 11 న కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం చంద్రబాబు ఈ సదస్సులో భాగంగా చర్చించనున్నారు.రాష్ట్రాన్రికి మళ్ళీ భారీగా పెట్టుబడులు, పరిశ్రమలు ఒక్కొక్కటిగా వస్తున్న నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ అవసరం పై సమగ్ర ఆదేశాలు ఇవ్వనున్నారు.

ముఖ్యంగా మహిళలు,చిన్నారులపై జరుగుతున్న అఘాయుత్యలపై ఉక్కుపాదం మోపేందుకు ఆదేశాలు జారీ చేయనున్నారు. సోషల్‌ మీడియా కేసుల దర్యాప్తు, ఇతర అంశాల పై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఈ సదస్సులో మాట్లాడనున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ కలెక్టర్ల సదస్సును కూటమి సర్కార్‌ నిర్వహించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement