వెలగపూడి : ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ఇందులో భాగంగా భవిష్యత్ లక్ష్యాలపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేస్తున్నారు. 6 నెలల పాలనలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి అంశాలపై సమీక్షిస్తున్నారు. శాంతి భద్రతలపైనా డీజీపీ, ఎస్పీలతో ఆరా తీస్తున్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్-2047 విజన్ డాక్యుమెంట్ ప్రజంటేషన్‌ను సీఎం ఇవ్వనున్నారు.
నూతనంగా తీసుకొచ్చిన పాలసీలపై దిశానిర్దేశం చేయడంతో పాటు.. నాలుగన్నరేళ్లు ఏ విధమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలని సమాలోచనలు చేయనున్నారు. బుధవారం ఆర్టీజీఎస్, వినతుల పరిష్కారం, గ్రామ, వార్డు సచివాలయాలు, వాట్సప్ గవర్నెన్స్, ప్రజల్లో సానుకూల దృక్పథం వంటి అంశాలపై చర్చించనున్నారు. వ్యవసాయం, పశుసంవర్థక, ఉద్యాన, పౌరసరఫరాలు, అటవీ, జలవనరులు, పంచాయతీరాజ్ వంటి శాఖలపై సమీక్షిస్తారు. సాయంత్రం 6.30 నుంచి 7.30 వరకు శాంతిభద్రతలపై సమీక్ష ఉంటుంది.