శ్రీ సత్యసాయి బ్యూరో, డిసెంబర్ 24 (ఆంధ్రప్రభ) : శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని రాజీవ్ గాంధీ నగర్ లో మంగళవారం ప్రహరీ గోడ కూలి గంగులప్ప (53) అనే కూలీ దుర్మరణం చెందాడు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కదిరి రూరల్ మండలం గ్రామంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన గంగులప్ప కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇందులో భాగంగా కదిరి పట్టణంలోని రాజీవ్ గాంధీ నగర్ లో ఒక పాత ఇల్లును కూలగొట్టే పనిని ఒప్పందం చేసుకున్నాడు.
పైకప్పు మొత్తం కూల్చివేశాడు. అయితే ప్రహరీ గోడ తొలగించే సమయంలో అదే గోడ కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు భార్య, ముగ్గురు కుమారులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతుడిని చూసి, తమ కుటుంబ పెద్దను కోల్పోయాం.. ఇక మాకు దిక్కెవరు అంటూ బోరున విలపించారు. కదిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.