Tuesday, November 26, 2024

Code – నేటి నుంచే ఎన్నికల కోడ్ – ఇక‌ గీత దాటితే వేటే

అమ‌లులోకి వ‌చ్చిన ప్రవర్తనా నియమావళి
ఎన్నిక‌ల క‌మిష‌న్ ప‌రిధిలోకి ప్ర‌భుత్వ ఉద్యోగులు
కొత్త స్కీమ్‌లు, శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు బంద్
ప్ర‌భుత్వంలో ఉన్న‌నేత‌లకు గ‌వ‌ర్నమెంట్ వెహిక‌ల్స్ క‌ట్
రాత్రి 10 గంట‌ల నుంచి.. ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు మైకులు మూగ‌నోము
ఆల‌యాలు, ప్రార్ధ‌నామందిరాలు, మ‌సీదుల‌లో ప్ర‌చారం నిషేధం
న‌గ‌దు పంచినా, తీసుకున్నా నేర‌మే
ఓట‌ర్లు కూడా కోడ్ ప‌రిధిలోకి వ‌స్తార‌న్న ఎన్నిక‌ల క‌మిష‌న్‌

లోక్‌సభ ఎన్నికల షెడ్యూలును శ‌నివారం ఎన్నిక‌ల క‌మిష‌న్ వెల్ల‌డించింది. దీంతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కూడా ప్ర‌క‌టించింది. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. ఈసీ ప్ర‌క‌ట‌న వెలువడిన మ‌రుక్ష‌ణం నుంచే దేశవ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వ‌చ్చింది. ఈ ప్రవర్తనా నియమావళి ఏమిటి, దాన్ని ఎవరు అమలు చేస్తారు.. అమలు తర్వాత ఏ విషయాలు నిషేధాజ్ఞ‌లు ఉంటాయో చ‌దివి తెలుసుకుందాం.

ప్రవర్తనా నియమావళి అంటే ఏమిటి?

దేశంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల క‌మిష‌న్‌ కొన్ని నిబంధనలను రూపొందించింది. ఈ నియమాలను ప్రవర్తనా నియమావళి అంటారు. లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఈ నిబంధనలను పాటించడం తప్పనిసరి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఏం చేయాలో, ఏం చేయకూడదో ఇందులో పొందుప‌రిచారు

1960లో తొలిసారి కోడ్ అమ‌లు

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం.. ఎన్నికల క‌మిష‌న్‌ రాజకీయ పార్టీలను శాంతియుత ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించాల‌ని ఆదేశిస్తుంది. ప్రవర్తనా నియమావళిని తొలిసారిగా 1960లో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రవేశపెట్టారు. 1962 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎన్నికల క‌మిష‌న్ తొలిసారిగా రాజకీయ పార్టీలకు ఈ నిబంధనలను వ‌ర్తింప‌జేసంది. ఇక ఈ ప్రవర్తనా నియమావళి విధానం 1967 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నుండి అమలులోకి వచ్చింది.

- Advertisement -

ఎన్నిక‌ల క‌మిష‌న్ ప‌రిధిలో ఉద్యోగులు

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రభుత్వ ఉద్యోగులుగా కాకుండా ఎన్నికల క‌మిష‌న్‌ ఉద్యోగులుగా పనిచేయాలి. ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రవర్తనా నియమావళిని ఎత్తివేస్తారు. ప్ర‌భుత్వం నుంచి, ప్ర‌భుత్వం సంస్థ‌ల నుంచి, కార్పొరేష‌న్ ల నుంచి జీతాలు స్వీక‌రించే ఏ ఉద్యోగి అయినా ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన‌కూడ‌దు. అలాగే ఎన్నిక‌ల విధుల్లో ఉన్న ఉద్యోగులు పూర్తిగా రాజ‌కీయ కార్య‌క‌లాపాల‌కు దూరంగా ఉండాలి. ఎన్నిక‌ల కోడ్ ఎత్తివేసేంత వ‌ర‌కూ ఈ ఆంక్ష‌లు కొన‌సాగుతాయి.

ఆంక్ష‌లు – నిషేధాలు

ప్రభుత్వ ఖర్చుతో మంత్రులు ఎన్నికల ర్యాలీలు నిర్వహించ కూడ‌దు. ఈ స‌మ‌యంలో మంత్రులు కూడా తమ నివాసం నుంచి కార్యాలయానికి వెళ్లేందుకు మాత్రమే ప్రభుత్వ వాహనాలను వినియోగించుకోవచ్చు. ఎన్నికల ర్యాలీలు, పర్యటనలకు ఉపయోగించరాదు.
ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత.. ఏ రాజకీయ పార్టీకి ప్రయోజనం కలిగించే ఏ కార్యక్రమంలోనైనా ప్రజా ధనాన్ని ఉపయోగించకూడదు. ప్రభుత్వ ప్రకటనలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వంటి అన్నిరకాల కార్యక్రమాలు ఆగిపోతాయి. అయితే.. కొన్ని పనులు ఇప్పటికే ప్రారంభించి ఉంటే, వాటిని కొనసాగించవచ్చు. అది కూడా ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆదేశాల‌తో మాత్ర‌మే చేయాల్సి ఉంటుంది.

దేవాలయం, మసీదు, చర్చి, గురుద్వారా లేదా ఏదైనా మతపరమైన స్థలాన్ని ఎన్నికల ప్రచారానికి ఉపయోగించకూడదు.
ప్రవర్తనా నియమావళి ప్రకారం, ప్రభుత్వం ఏ ప్రభుత్వ అధికారిని, ఉద్యోగిని బదిలీ చేయ‌డం, పోస్టింగ్ ఇవ్వ‌డం చేయ‌రాదు. బదిలీ చాలా ముఖ్యమైనవి అయితే.. ఎన్నికల సంఘం నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
మీటింగ్ నిర్వహించడం, ఊరేగింపు నిర్వహించడం, పబ్లిక్ లేదా ప్రైవేట్ ప్రదేశంలో లౌడ్ స్పీకర్లను ఉపయోగించే ముందు స్థానిక పోలీసు అధికారుల నుండి రాతపూర్వక అనుమతి పొందడం అవసరం. రాత్రి 10.00 నుంచి ఉదయం 6.00 గంటల మధ్య లౌడ్ స్పీకర్లను ఉపయోగించరాదు.

ఉల్లంఘిస్తే ఏమవుతుంది

ఏదైనా రాజకీయ పార్టీ లేదా దాని అభ్యర్థి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే, అప్పుడు ప్రచారం చేయకుండా నిషేధించవచ్చు. అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించే అధికారం ఈసీకి ఉంటుంది.
ఇది మాత్రమే కాదు.. అవసరమైతే అభ్యర్థిపై క్రిమినల్ కేసు కూడా దాఖలు చేయవచ్చు. జైలుకు కూడా వెళ్లే నిబంధన కూడా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement