నంద్యాల జనవరి 10 : రాష్ట్రంలోని మత్స్యకారుల అభివృద్ధి కోసం ఉమ్మడి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి పేర్కొన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలంలోని నెహ్రూ నగర్ గ్రామంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో శ్రీశైలం బ్యాక్ వాటర్ జలాశయంలో చేపపిల్లలు వదిలే కార్యక్రమం శుక్రవారం చేపట్టారు.
ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ… మత్స్యకారుల ఆర్థిక ప్రగతికి ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. మన ప్రభుత్వం మత్స్యకారుల అభ్యున్నతికి నూతన పథకాలు ప్రవేశపెడుతూ, వారికి స్థిరమైన జీవనోపాధి కల్పించేందుకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులతో కూడిన మార్పులు తీసుకురావటమే ప్రధాన లక్ష్యంగా మత్స్యశాఖ చర్యలు చేపడుతుందని తెలిపారు.
ఉమ్మడి కర్నూలు జిల్లా డీఎఫ్‌సీఎస్ చైర్మన్ బియస్ నవీన్ కుమార్ మాట్లాడుతూ… ఈకార్యక్రమం జలవనరుల సమర్థ వినియోగంతో పాటు మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడంలో దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ రాఘవ రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ ఆఫీసర్ శ్యామల, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ సంధ్యారాణి, పగిడాల ఎంపీడీవో సుమిత్రమ్మ, నెహ్రూ నగర్ సర్పంచ్ కూరాకుల రాజేశ్వరి, స్థానిక మత్స్యకారులు పాల్గొన్నారు.