2029లో అధికారమే లక్ష్యంగా పరిపాలన…
అన్నివర్గాల మన్ననలను పొందుతున్న బాబు ప్రభుత్వం..
టీడీపీ సభ్యత్వం గౌరవానికి ప్రతీక..
మంత్రి కొలుసు పార్థసారథి…
టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు..
( ఎన్టీఆర్ బ్యూరో ఆంధ్రప్రభ ) : రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడంతో పాటు, నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి, ఉద్యోగాల అవకాశాలు కల్పించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర సమాచార శాఖ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. 2029లో అధికారమే లక్ష్యంగా అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందించడంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని పటమట న్యూ ఆర్టీసీ కాలనీలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ కార్యాలయంలో శనివారం టీడీపీ సభ్యత నమోదు కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కొలుసు పార్థసారథి ముందుగా కేంద్ర మాజీ మంత్రి ఎర్రంనాయుడు వర్ధంతి సందర్భంగా, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఎర్రంనాయుడు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కార్యకర్తల సంక్షేమంతో పాటు ఎంతో శ్రమిస్తుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో లక్ష సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తిచేయాలని పార్టీ నిర్ణయించడం జరిగిందని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా తెలియజేస్తూ ముందుకు వెళుతుందని, రాష్ట్రంలో ఉన్న బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడంతో పాటు ఉన్నతమైన పదవులను ఇచ్చి ఎంతో ప్రోత్సహిస్తున్నారని చెప్పారు.
రాష్ట్రంలో సాఫ్ట్ వేర్ రంగాన్ని అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని సంకల్పంతో తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు. అనంతరం టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ కు టీడీపీ సభ్యత్వాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఆర్టీసీ చైర్మన్ కొనకల్లు నారాయణరావుతో పాటు పలువురు న్యాయవాదులు, సీనియర్ తెలుగుదేశం నాయకులు, వివిధ డివిజన్ కార్పొరేటర్లు పాల్గొన్నారు.